
'మరి కొన్నేళ్లు ఆ జోడిదే హవా'
ముంబై: ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ నంబర్ వన్ క్రీడాకారిణులు సానియా మీర్జా-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లపై భారత టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది రెండు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ తో సహా తొమ్మిది టైటిల్స్ ను గెలిచిన సానియా-హింగిస్ ల జోడి కొన్నేళ్ల పాటు అదే ఊపును కొనసాగించి మరిన్ని గ్రాండ్ స్లామ్స్ ను సొంతం చేసుకుంటారని భూపతి అభిప్రాయపడ్డాడు.
' సానియా ఒక స్ఫూర్తి. గత మూడు సంవత్సరాల నుంచి తీవ్రంగా కష్టపడుతూ మంచి ఫలితాలను సాధిస్తోంది. ఆ జోడి జైత్రయాత్ర ఈ ఏడాదికి మాత్రమే పరిమితం కాదు.. వారి హవా మరి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆటలో సానియా-హింగిస్ ల సహకారం నిజంగా అద్భుతం' అని భూపతి కొనియాడాడు. 2016 రియో ఒలింపిక్స్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో సానియా-హింగిస్ ల ద్వయం, పురుషల డబుల్స్ లో రోహన్ బోపన్న-లియాండర్ పేస్ ల జోడి పతకాలను సాధించే అవకాశం ఉందన్నాడు.