
ప్రత్యేక కారణాలు లేవు
న్యూఢిల్లీ: భారత ఆటగాళ్లతో కలిసి ఆడకపోవడం వెనుక ప్రత్యేకమైన కారణాలేమీ లేవని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. గతంలో కలిసి ఆడినా ప్రస్తుతం కుదరడం లేదని చెప్పింది. అయితే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్‌లో హోరియా టెకావ్ (రొమేనియా) తోనే కలిసి బరిలోకి దిగుతానని వెల్లడించింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం తమ జోడి ఈ టోర్నీ వరకు కొనసాగుతుందని తెలిపింది. ‘టెకావ్ ప్రపంచస్థాయి డబుల్స్ ప్లేయర్. బ్యాక్‌హాండ్, భారీ సర్వీస్‌లు చేయగల సమర్థుడు. మూడు టోర్నీల్లో కలిసి ఆడాలని మేం ముందుగానే అనుకున్నాం. కాబట్టి ఆస్ట్రేలియా ఓపెన్ వరకు మా జోడి కొనసాగుతుంది. మిగతా అంశాలను తర్వాత నిర్ణయించుకుంటాం. క్లే కోర్టుల్లో టెకావ్ మంచి ఆటగాడే అయినా ఫ్రెంచ్ ఓపెన్ గురించి ఇప్పుడే చెప్పలేను’ అని సానియా వ్యాఖ్యానించింది.