
దినేశ్ కార్తీక్
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడే ఐదు వన్డేల సిరీస్ కోసం
ముంబై : సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడే ఐదు వన్డేల సిరీస్ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు చోటు దక్కలేదు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన అనంతరం 2017 నుంచి దినేశ్ కార్తీక్ 20 మ్యాచ్‌లు ఆడి ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చాడు. ఎక్కువ సందర్భాల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం రాకపోయినా... జట్టు అవసరాలకు అనుగుణంగా అతను కీలక సమయాల్లో వేర్వేరు స్థానాల్లో రాణించాడు. అయినా కార్తీక్‌ను కాదని సెలక్టర్లు దూకుడులో ఈతరం ప్రతినిధిగా కనిపిస్తున్న రిషభ్ పంత్‌పైనే నమ్మకం ఉంచారు.
ఈ పరిస్థితుల్లో కార్తీక్ ప్రపంచకప్ ఆడే దారులు మూసుకుపోలేదని ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెబుతున్నప్పటికీ.. కార్తీక్ వన్డే కెరీర్ ముగిసినట్లేనని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాణించినా.. కార్తీక్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇక నుంచి కార్తీక్‌ను కేవలం టీ20 బ్యాట్స్‌మెన్‌గానే పరిగణించాలి. అతని వన్డే కెరీర్ ముగిసినట్లే. న్యూజిలాండ్ సిరీస్‌లో అంబటి రాయుడిలా మ్యాచ్‌ను కార్తీక్ నిలబెట్టలేకపోయాడు. కేవలం ఓ ఫినిషర్‌గా మాత్రమే గుర్తింపు పొందాడు. ఇదే సెలక్టర్లను ఆలోచింప జేసింది. దీంతో అతన్ని పక్కటన పెట్టారు. అలా అని తానేం పంత్‌కు మద్దతు తెలుపడం లేదు. ధోనితో పొల్చితే వికెట్ కీపర్‌గా ఇద్దరి ఆటగాళ్లలో లోపం ఉంది. పంత్ కన్నా దినేశ్ కార్తీక్ కొంత మెరుగు. పంత్ బ్యాట్స్‌మన్‌గా మద్దతు తెలపలేను. అతను 50 ఓవర్ల ఫార్మాట్లో ఇప్పటి వరకు తన సత్తా చాట లేదు.’ అని చెప్పుకొచ్చాడు.
2018లో కార్తీక్ వరుసగా 21, 33, 31 నాటౌట్, 1, 44, 37, 12, 25 నాటౌట్, 38 నాటౌట్, 0 పరుగులు చేశాడు. ఫినిషర్‌గా తన పాత్రకు న్యాయం చేశాడు. మిడిలార్డర్‌లో ఒక ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ బాగుంటుందని భావించడం కూడా కార్తీక్‌పై వేటు పడేలా చేసింది.