
రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్ (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : ధోనికి ప్రత్యామ్నయ వికెట్ కీపర్‌గా యువ ఆటగాడు రిషబ్ పంత్ బెస్ట్ అని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ప్రతిసారి ధోనికి బ్యాకప్‌గా దినేశ్ కార్తీక్, పార్ధీవ్ పటేల్‌లను ఎంపిక చేయడం తనకు నచ్చలేదని ఓ జాతీయ దినపత్రికకు రాసిని కాలమ్‌లో పేర్కొన్నారు. నాణ్యమైన వికెట్ కీపర్లున్నా ఈ ఇద్దరినే తీసుకోవడం అంత మంచిదికాదన్నారు. శ్రీలంకలో జరిగే నిధాస్ ముక్కోణపు సిరీస్‌లో రిషబ్ పంత్‌కు అవకాశిమిస్తే తనేంటో చూపిస్తాడని మంజ్రేకర్ రాసుకొచ్చారు. భారత భవిష్యత్తు క్రికెట్ దృష్ట్యా పంత్‌కు అవకాశమివ్వడం మంచిదన్నారు.
మనీశ్‌పాండే కూడా గొప్ప నైపుణ్యం కలిగిన బ్యాట్స్‌మన్ అన్న మంజ్రేకర్ అతని నిలకడలేమి ప్రదర్శనే తనను అసంతృప్తికి గురిచేస్తోందన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో రాణించిన పాండే మరుసటి మ్యాచ్‌లో విఫలమయ్యాడన్నారు. ఇది అర్థం చేసుకోవచ్చని కానీ ఇలా ఆస్ట్రేలియాపై తన తొలి సెంచరీ సాధించనప్పటి నుంచి తన ప్రదర్శనలో స్థిరత్వం కనబర్చలేదన్నారు. ఇక సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిన టీం మేనేజ్‌మెంట్‌ను మంజ్రేకర్ కొనియాడారు. ఇది భారత క్రికెట్‌కు మంచిదన్నారు. సరేశ్ రైనా పునరాగమనం కూడా కలిసొచ్చే అంశమని, మిడిలార్డర్ మరింత బలంగా తయారైందన్నారు. అతను నిలకడగా రాణిస్తే జట్టులో కొనసాగడం ఖాయమన్నారు.