
సెమీస్‌లో సతీశ్ ఆసియా సీనియర్ బాక్సింగ్
ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత బాక్సర్లకు మిశ్ర మ ఫలితాలు ఎదురయ్యాయి. సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... మదన్‌లాల్ (52 కేజీలు), కుల్‌దీప్ సింగ్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. సెమీస్‌కు చేరిన సతీశ్ కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. సియోవుష్ జుకురోవ్ (తజకిస్తాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సతీశ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయం సాధించాడు.
సతీశ్ పంచ్‌ల ధాటికి తట్టుకోలేని జుకురోవ్ పోటీపడకుండా తప్పించుకోవడంతో రిఫరీ అతనికి రెండుసార్లు హెచ్చరించారు. అయినా జుకురోవ్ అదే విధంగా వ్యవహరించడంతో రిఫరీ మూడో రౌండ్ పూర్తికాకుం డానే బౌట్‌ను నిలిపివేసి సతీశ్‌ను విజేతగా ప్రకటించారు. మదన్‌లాల్ 0-3తో షఖోబిదిన్ జోయ్‌రోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో; కుల్‌దీప్ 1-2తో కిమ్ హ్యోంగ్‌కు (కొరియా) చేతిలో ఓడిపోయారు. శుక్రవారం సెమీఫైనల్స్ జరుగుతాయి.