
'ఆ బాధ్యత సీనియర్ క్రికెటర్లదే'
మెల్బోర్న్:సాంప్రదాయ టెస్టు క్రికెట్ను బ్రతికించాల్సిన బాధ్యత సీనియర్ క్రికెటర్లేదేనని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్సష్టం చేశాడు. కొన్నాళ్లపాటు ట్వంటీ 20 ఫార్మెట్ను పక్కకు పెట్టి టెస్టు క్రికెట్కు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లదేనన్నాడు. 'ట్వంటీ 20 ఫార్మాట్ కు పెరుగుతున్న ఆదరణతో ఆటగాళ్లు లాభపడుతున్నారు. ఈ ఫార్మాట్లో ఆటగాళ్ల ఆర్థిక ప్రయోజనాలే ఎక్కువగా కనబడుతున్నాయి. దాంతో టెస్టు క్రికెట్ అనేది మరుగున పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టెస్టు క్రికెట్కు అండగా నిలవాల్సిన అవసరం సీనియర్ ఆటగాళ్లపైనే ఉంది. ప్రతీ దేశంలో ఎవరికి వారే స్వచ్ఛందంగా టెస్టు క్రికెట్ను కాపాడతారని ఆశిస్తున్నా'అని స్టీవ్ వా తెలిపాడు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎప్పుడూ టెస్టుల్లో భాగమైన బ్యాగీ గ్రీన్ క్యాప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారని, దేశం కోసం ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని వా అన్నాడు. అయితే పలుదేశాల్లో టెస్టు క్రికెట్ ఆందోళనకరంగానే ఉందన్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్లో టెస్టు క్రికెట్ పరిస్థితిని వా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. టీ 20 క్రికెట్ ట్రోఫీని గెలిచిన వెస్టిండీస్.. టెస్టుల్లో మాత్రం నాణ్యమైన క్రికెట్ ఆడటంలో వెనుకబడిపోయిందన్నాడు.