పవర్ ఆఫ్ సెరెనా!
న్యూయార్క్: 'ఓటమితో ఎప్పుడూ కుంగిపోకూడదు. తిరిగి లేవాలి. మరింత కష్టపడాలి. మరింత సాధన చేయాలి. ఓటమి అనే ఆ విషయాన్ని మనసులోకి తీసుకుని పోరాడితేనే తిరిగి మళ్లీ పైకి లేవగలుగుతాం. అందుకే ఎప్పుడూ దేని గురించి నిరాశ చెందకూడదు. తిరిగి పోరాడాలి' అని సెరెనా పదే పదే చెప్పేమాట. ఆమె మాటలకే పరిమితం కాదు.. చేతల్లో చూపించింది. చూపిస్తునే ఉంది.
ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్ననల్లకలువ తాజాగా మరో అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో రష్యా క్రీడాకారిణి యెరోస్లావా స్వెదోపై విజయం సాధించడం ద్వారా అత్యధిక సింగిల్స్ మ్యాచ్లు(308) గెలిచిన ఘనతను కైవసం చేసుకుంది. దీంతో గ్రాండ్ స్లామ్ ఓపెన్ ఎరాలో టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, రోజర్ ఫెదరర్ పేరిట ఇప్పటివరకూ ఉన్న 307 సింగిల్స్ మ్యాచ్ ల రికార్డు బద్ధలైంది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా 6-2, 6-3 తేడాతో స్వెదోవాపై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకుంది.
అంతకుముందు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధిక మహిళల సింగిల్స్ మ్యాచ్లు గెలిచిన మార్టినా నవ్రతిలోవా రికార్డును సెరెనా అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ ను సొంతం చేసుకున్స సెరెనా.. 22 గ్రాండ్ స్లామ్లు గెలిచి జర్మనీ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమం చేసింది. అయితే ఈ ఏడాది యూఎస్ ఓపెన్ గెలిచి స్టెఫీగ్రాఫ్ రికార్డును సవరించాలనే పట్టుదలగా ఉంది. గతేడాది వరుసగా ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ టైటిల్స్ను గెలిచిన సెరెనా.. ఆ ఏడాది యూఎస్ ఓపెన్ సాధించడంలో విఫలమై కెరీర్ క్యాలెండర్ స్లామ్ను తృటిలో కోల్పోయింది.