
సెయింట్ లూసియా: టిమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక రికార్డు తాజాగా బద్ధలైంది. రోహిత్ శర్మ రికార్డును భారత మహిళా ఓపెనర్ షెఫాలీ వర్మ బ్రేక్ చేసింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో షెఫాలీ వర్మ 49 బంతుల్లో 73 పరుగులు సాధించారు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. షెఫాలీ వర్మ 15 ఏళ్ల 285 రోజుల వయసులోనే అంతర్జాతీయ టీ20ల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశారు. అంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ శర్మ 20 ఏళ్ల 143 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించి పిన్న వయసులో ఆ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు లిఖించగా, దాన్ని తాజాగా షెఫారీ బద్ధలు కొట్టారు.(ఇక్కడ చదవండి: మంధాన, షెఫాలీ ‘రికార్డు’ బ్యాటింగ్)
కాగా, ఓవరాల్‌గా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఘనత యూఏఈకి చెందిన ఎగోడాజ్ పేరిట ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని షెఫాలీ ఆక్రమించారు. ఎగోడాజ్ 15 ఏళ్ల 267 రోజుల వయసులో అర్థ శతకం సాధించారు. ఇదిలా ఉంచితే, విండీస్‌తో తొలి టీ20లో షెఫాలీతో కలిసి మంధాన 143 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా టీ20ల్లో భారత తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి కొత్త రికార్డు లిఖించారు. మంధాన(67; 46 బంతుల్లో 11 ఫోర్లు) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 185 పరుగులు చేయగా, విండీస్ మహిళలు 101 పరుగులకే పరిమితమయ్యారు.