న్యూఢిల్లీ: ప్రపంచ అత్యుతమ స్సిన్నర్ గా ఎదిగే సత్తా భారత యువ సంచలనం కుల్దీప్ యాదవ్ కు ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ కుల్దీప్ యాదవ్ అన్ని ఫార్మాట్లలో ఓపికగా బౌలింగ్ చేసిన పక్షంలో అతని తిరుగులేదని కొనియాడాడు. కుల్దీప్ చైనామన్ బౌలర్(ఎడమచేతి మణికట్టు బౌలర్) కావడంతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు ఇబ్బందులు తప్పవని జోస్యం చెప్పాడు. కాకపోతే కుల్దీప్ కు ఇక్కడ ఓపిక అనేది చాలా అవసరంగా వార్న్ సూచించాడు.
'ఆసీస్ తో వన్డే సిరీస్ తరహాలో కుల్దీప్ ఓపికగా బౌలింగ్ చేస్తే.. అతను ప్రపంచ మేటి స్పిన్నర్ గా ఎదుగుతాడు. పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాను ఛాలెంజ్ చేసే సత్తా కుల్దీప్ కు ఉంది. ప్రస్తుత క్రికెట్ లో యాసిర్ షా అత్యుత్తమ స్పిన్నర్ గా ఉన్నాడు. అతన్ని కుల్దీప్ అధిగమిస్తాడనేది నా అభిప్రాయం. కుల్దీప్ ఇదే జోరును కొంతకాలం కొనసాగించగల్గితే బెస్ట్ లెగ్ స్పిన్నర్ కావడం ఖాయం'అని వార్న్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా కుల్దీప్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ జూన్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో కుల్దీప్ అరంగేట్రం చేశాడు.ఆసీస్ తో జరిగిన సిరీస్ లో కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేశాడనే చెప్పాలి. ఈ సిరీస్ లో ఒక హ్యాట్రిక్ ను నమోదు చేసిన కుల్దీప్.. నాగ్ పూర్ వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక మెయిడిన్ సాయంతో 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు.