
'వాట్సన్ క్యాన్సర్ కణితి లాంటి వాడు'
సిడ్నీ:తనతో పాటు చాలాకాలం క్రికెట్ ఆడిన షేన్ వాట్సన్ను ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ క్యాన్సర్ కణితితో పోల్చాడు. గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న విభేదాలను క్లార్క్ మరోసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. తన ఆటో బయోగ్రఫీ విడుదలకు సంబంధించి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లార్ పలు విషయాలను వెల్లడించాడు. తాను జట్టుకు కెప్టెన్ గా ఉన్న సమయంలో చాలా మంది ఆటగాళ్లు సెపరేట్ గ్రూప్ గా ఉండేవారనే సంగతిని పేర్కొన్నాడు.
వారంతా ఒక కణితి లాంటి వారని, ఆ గ్రూప్ ను అలానే వదిలేస్తే క్యాన్సర్ తరహాలో ప్రమాదకరంగా మారిపోతారన్నాడు. ఆ గ్రూప్ లో వాట్సన్ కూడా ఉన్నాడంటూ మరోసారి అడిగిన ప్రశ్నకు క్లార్క్ అవుననే సమాధానం ఇచ్చాడు. దీనిలో భాగంగానే మూడు సంవత్సరాల క్రితం భారత్ లో టెస్టు సిరీస్ లో మొహాలీలో జరిగిన మూడో మ్యాచ్ నుంచి పలువురు ఆటగాళ్లపై వేటు వేసినట్లు పేర్కొన్నాడు. మరోవైపు 2009లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా టెస్టు విజయం సాధించిన తరువాత అప్పటి వైస్ కెప్టెన్ గా ఉన్న సైమన్ కాటిచ్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పాడు చేశాడన్నాడు.