అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు పదునైన బంతులతో విజృంభించారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు జతగా పేసర్లు ఇషాంత్ శర్మ, బూమ్రాలు రాణించి ఆసీస్ టాపార్డర్‌ను నిలువరించారు. ఈ క్రమంలోనే షాన్ మార్ష్ చెత్త రికార్డును మూటగట్టుకున‍్నాడు. అది కూడా 130 ఏళ్ల తర్వాత చెత్త గణాంకాలను నమోదు చేయడం గమనార్హం.
అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ స్టంప్‌కి దూరంగా అశ్విన్ విసిరిన బంతిని షాన్ మార్ష్ హిట్ చేసేందుకు ప్రయత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో రెండు పరుగుల వద్దే మార్ష్ పెవిలియన్ చేరాడు. ఇలా టెస్టుల్లో షాన్ మార్ష్ ఇలా సింగిల్ డిజిట్‌కే వరుసగా ఔటవడం ఇది ఆరోసారి. కాగా, 1888 తర్వాత ఆసీస్ టాప్-5 ఆటగాళ్లలో ఎవరూ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌కి ఔటయిన దాఖలా లేదు. పేలవ ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న షాన్ మార్ష్ గత 13 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్కసారి కూడా 40కి మించి పరుగులు చేయలేదు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. వరుస వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ట్రావిస్ హెడ్(61 బ్యాటింగ్) ఆదుకోవడంతో తిరిగి తేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment