
క్రికెట్ జట్లకు షోయబ్ అక్తర్ వార్నింగ్
కరాచీ: పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి విదేశీ జట్లు వెనకడుగు వేస్తున్న సమయంలో అందుకు మరింత బలాన్నిస్తూ ఆ దేశ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తమ దేశంలో క్రికెట్ ఆడటం ఎంతమాత్రం సురక్షితం కాదని విషయాన్నితేల్చిచెప్పాడు. ఈ మేరకు పాక్ కు విదేశీ జట్లు రావొద్దని హెచ్చరికలు జారీ చేశాడు.క్వెట్టాలోని పోలీస్ శిక్షణా శిబిరంపై ఉగ్ర మూకలు నరమేధం సృష్టించి 62 మంది పోలీస్ క్యాడెట్లు ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటనపై తాజాగా మాట్లాడిన అక్తర్.. తమ దేశంలో సరైన రక్షణ లేదనే విషయాన్ని అంగీకరించాడు.
'మా దేశంలో సరైన భద్రత లేదు. ఇది విదేశీ జట్లకు ఎంతమాత్రం సురక్షితం కాదు. పాకిస్తాన్లో పరిస్థితులు చక్కబడేవరకూ ఏ జట్టు ఇక్కడకు రావడం అంత శ్రేయస్కరం కాదు. ఆ రిస్క్ను కొనితెచ్చుకోవద్దు. దేశంలోని రక్షణపై నెలకొన్న ఆందోళనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకు ఓపిక పట్టక తప్పుదు. మా దేశంలో విదేశీ క్రికెట్ జట్లు పర్యటించడానికి కొంత సమయం అయితే అవసరం' అని అక్తర్ పేర్కొన్నాడు.
విదేశీ జట్లు తమ దేశంలో పర్యటించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రయత్నాలు చేయడం నిజంగా దురదృష్టకరమన్నాడు. తమ దేశంలో ఉగ్రదాడులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడకు రావాలంటూ విదేశీ జట్లను ఆహ్వానించడం ప్రస్తుతం సరైన చర్య కాదని షోయబ్ తెలిపాడు. త్వరలోనే పాక్లో సాధారణ పరిస్థితి నెలకొంటుదనే ఆశాభావం వ్యక్తం చేశాడు.