శ్రేయస్ సూపర్ షో
→ డబుల్ సెంచరీతో రాణింపు
→ ఆసీస్, భారత్ ‘ఎ’ జట్ల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’
ముంబై: యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తన సూపర్ ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సరిగ్గా శతకం బాదిన అతను ఈసారి అగ్రస్థాయి జట్టు ఆస్ట్రేలియాపై ఏకంగా అజేయ డబుల్ సెంచరీ (210 బంతుల్లో 202 నాటౌట్; 27 ఫోర్లు, 7 సిక్సర్లు)తో తానేమిటో చాటుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి బౌలింగ్‌ను ఏమాత్రం బెదరకుండా ఎదుర్కొని భారీ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి సెలక్టర్లను తనపై దృష్టి సారించేలా చేసుకున్నాడు. ఫలితంగా భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఈ మూడు రోజుల మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకుముందు భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 403 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గౌతమ్ (68 బంతుల్లో 74; 10 ఫోర్లు; 4 సిక్సర్లు) వేగంగా ఆడాడు.
స్పిన్నర్ లియోన్‌కు నాలుగు, బర్డ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 66 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌ను కుర్రాళ్లు తమ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టారు. దీంతో ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 4 వికెట్లకు 110 పరుగులు చేసింది. హ్యాండ్స్‌కోంబ్ (69 బంతుల్లో 37; 5 ఫోర్లు), వార్నర్ (49 బంతుల్లో 35; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. పాండ్యా, సైని, దిండా, పంత్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.
శ్రేయస్ జోరు
176/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. శ్రేయస్ బ్యాటింగ్ జోరును కొనసాగించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు లియోన్, ఓకీఫ్‌లపై ఎదురుదాడికి దిగడంతో ఆట ఆరంభమైన పది నిమిషాల్లోనే 103 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. రెండో రోజు ఆటలో అయ్యర్ పేసర్ బర్డ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేదు. అయితే చివరి రోజు అతడి బౌలింగ్‌నూ ఆడుకున్నాడు. అతడి రెండో ఓవర్‌లోనే మూడు ఫోర్లు బాది సెంచరీ పూర్తి చేశాడు. రిషభ్ పంత్ (40 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 55 పరుగులు జత చేశాడు. ఇషాన్ కిషన్ (4) త్వరగానే అవుట్‌కాగా అనంతరం వచ్చిన గౌతమ్ కూడా వన్డే తరహాలోనే ఆడడంతో స్కోరు బోర్డు పరిగెత్తింది. లియోన్ బౌలింగ్‌లోనే నాలుగు భారీ సిక్సర్లు బాది తొలి టెస్టుకు ముందు అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. 43 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. అటు అయ్యర్ అద్భుత స్ట్రోక్ ప్లేతో స్పిన్, పేస్ బౌలర్లను చీల్చి చెండాడాడు. దీంతో లంచ్ సమయానికి 32 ఓవర్లలోనే భారత్ 171 పరుగులను జత చేసింది. అయితే లంచ్ అనంతరం గౌతమ్‌ను ఓకీఫ్ బౌల్డ్ చేశాడు. అప్పటికి ఏడో వికెట్‌కు అయ్యర్, గౌతమ్ కలిసి 138 పరుగులు జత చేశారు. ఆ మరుసటి బంతికే షాబాజ్ నదీమ్ వికెట్ తీసినా హ్యాట్రిక్ అవకాశాన్ని దిండా వమ్ము చేశాడు. అటు అయ్యర్ మాత్రం తన ధాటిని కొనసాగిస్తూ ఓకీఫ్ వేసిన ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాది 184 పరుగుల వ్యక్తిగత స్కోరు నుంచి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చివరి రెండు వికెట్లను లియోన్ పడగొట్టి భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.