కోహ్లి కోసం రంగంలోకి స్మిత్‌, వార్నర్‌! | Smith And Warner Help Australian Bowlers Combat Kohli | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 26 2018 4:28 PM | Last Updated on Mon, Nov 26 2018 4:37 PM

Smith And Warner Help Australian Bowlers Combat Kohli - Sakshi

డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌

సిడ్నీ : సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత్‌.. మూడు టీ20ల సిరీస్‌ను విజయవంతంగా ముగించింది. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్‌లో చేజారిన విజయం, రెండో మ్యాచ్‌ రద్దు తర్వాత తమ అసలు సత్తాను ప్రదర్శించి సిరీస్‌ను సమం చేసింది. ఆసీస్‌ అంటేనే పూనకంతో ఊగిపోయే టీమిండియా కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి.. తన అసలు సిసలు ఆటతో భారత్‌కు విజయాన్నందించాడు. అయితే అదృష్టవశాత్తు టీ20 సిరీస్‌లో గట్టెక్కిన ఆసీస్‌కు అసలు పరీక్ష డిసెంబర్‌ 6 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్‌ సిరీస్‌తో మొదలుకానుంది.  ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రికెట్‌ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారత్‌ బ్యాట్స్‌మెన్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉండటం ఆసీస్‌ను కలవరపెడుతోంది. (చదవండి: స్పిన్‌తో ‘సిడ్నీ’ వశం)

ఈ నేపథ్యంలోనే  బాల్‌ట్యాంపరింగ్‌ వివాదంతో జట్టుకు దూరమైన సీనియర్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై నిషేధం ఎత్తేయాలని ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ).. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)పై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ డిమాండ్‌పై పలుమార్లు చర్చించిన సీఏ అధికారులు నిషేధం ఎత్తేయడం కుదరదని స్పష్టం చేశారు.  టీ20 సిరీస్‌ ఆసాంతం కోహ్లిసేన ఆధిపత్యం కనబర్చడంతో ఆసీస్‌ జట్టులో కలవరపాటు మొదలైంది. ముఖ్యంగా ఫుల్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లిని ఎదుర్కోవడానికి ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ భారీ కసరత్తులు మొదలెట్టింది. ఇందులో భాగంగా స్మిత్‌, వార్నర్‌ల పర్యవేక్షణలో ఆసీస్‌ బౌలర్లను సిద్దం చేస్తోంది. ఆదివారం సిడ్నీ మైదానంలో మూడో టీ20 ముందు ఆసీస్‌ నెట్‌ ప్రాక్టీస్‌కు అనూహ్యంగా డేవిడ్‌ వార్నర్‌ హాజరయ్యాడు. కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌తో కలిసి అంపైర్‌ స్థానంలో నిలబడి హజల్‌వుడ్‌, ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ను పరీక్షించాడు. (చదవండి: తొలి రెండు టెస్టులకు ఆసీస్‌ జట్టు ఇదే..)

ఈ మ్యాచ్‌ అనంతరం వార్నర్‌ ఆసీస్‌ డ్రెస్సింగ్‌ రూంలోకి కూడా వెళ్లినట్లు ఆసీస్‌ మీడియా పేర్కొంది. ఇక ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ మాట్లాడుతూ.. ‘ స్మిత్‌, వార్నర్‌లు బౌలింగ్‌ కోచ్‌లతో మాట్లాడారు. నెట్స్‌లో వారిద్దరికి బౌలింగ్‌ చేయడం.. టెస్ట్‌లకు సిద్దమవుతున్న మాకో మంచి అవకాశం. ప్రపంచ గొప్పబ్యాట్స్‌మన్‌ అయిన స్మిత్‌కు బౌలింగ్‌ చేయడం గొప్ప విషయం. అతని వ్యూహాలు మాకు ఉపయోగపడతాయి’ అని తెలిపాడు. నిషేధంతో దూరమైన స్మిత్‌, వార్నర్‌లు క్లబ్‌ క్రికెట్‌లో న్యూసౌత్‌వేల్స్‌ జట్టు తరపున ఆడుతూ పునరాగమనం కోసం కష్టపడుతున్న విషయం తెలిసిందే. (చదవండి: నిషేధ కాలాన్ని తగ్గించేది లేదు )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement