వరల్డ్ యూత్ బాక్సింగ్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. 52 కేజీల విభాగంలో ఆసియా రజత పతక విజేత గౌరవ్ సోలంకి, 64 కేజీల కేటగిరీలో నీరజ్ పర్సార్‌లు ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. బల్గేరియాలోని సోఫియాలో గురువారం జరిగిన 52 కేజీల రెండో రౌండ్ బౌట్‌లో సోలంకి 2-1తో దిమిత్రి అసాను (బల్గేరియా)పై విజయం సాధించాడు.
తొలి రౌండ్‌లో అసాను పంచ్‌లకు కాస్త తడబడిన భారత బాక్సర్ తర్వాతి రెండు రౌండ్లలో చెలరేగాడు. పదునైన పంచ్‌లతో వ్యూహాత్మకంగా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 64 కేజీ రెండో రౌండ్‌లో చగ్రెల్‌బెగ్ పజేవ్ (తుర్కుమెనిస్థాన్) బౌట్ నుంచి తప్పుకోవడంతో టెక్నికల్ నాకౌట్ (టీకేఓ) ద్వారా నీరజ్‌ను విజేతగా ప్రకటించారు. ప్రిక్వార్టర్స్‌లో సోలంకి.. విలియమ్ డోంగే (ఐర్లాండ్)తో; నీరజ్... నెనైల్ జార్జో (రొమేనియా)తో తలపడతారు.