
సఫారీలదే సిరీస్
ఆక్లాండ్: న్యూజిలాండ్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-2 తేడాతో దక్కించుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాధారణ స్కోరు లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు డీకాక్(6), హషీమ్ ఆమ్లా(8) నిరాశపరిచారు. ఆ తరువాత డుమినీ(3) స్వల్ప వ్యవధిలో అవుట్ కాగా, డివిలియర్స్ (23)ఫర్వాలేదనిపించాడు.
అయితే డు ప్లెసిస్(51 నాటౌట్), డేవిడ్ మిల్లర్(45 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా విజయాన్ని సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 41.1 ఓవర్లలో149 పరుగులకు ఆలౌటైంది. బ్రౌన్లీ(24), నీషమ్(24) సాంత్నార్(24), గ్రాండ్ హోమ్(32)లే కివీస్ జట్టులో రెండంకెల స్కోరు నమోదు చేసిన ఆటగాళ్లు . దాంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా మూడు వికెట్లు సాధించగా, తాహీర్, పెహ్లికువాయోలకు తలో రెండు వికెట్లు దక్కాయి. తొలి వన్డేను దక్షిణాఫ్రికా గెలవగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ను విజయం వరించగా, నాల్గో వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందింది.