‘అడ్డంగా’ నిలబడ్డారు! | south africa struggling to draw the fourth and last test match with host india | Sakshi
Sakshi News home page

‘అడ్డంగా’ నిలబడ్డారు!

Published Mon, Dec 7 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

‘అడ్డంగా’ నిలబడ్డారు!

‘అడ్డంగా’ నిలబడ్డారు!

ఆమ్లా మొదటి పరుగు చేసేందుకు 46 బంతులు తీసుకున్నాడు. ఆమ్లా సరే... వన్డేల్లో 31 బంతుల్లోనే సెంచరీ బాదేసిన డివిలియర్స్ తొలి పరుగు చేసేందుకు పట్టిన బంతులు 33. వీరిద్దరు క్రీజ్‌లో జత కలిశాక ఏకంగా 62 బంతుల పాటు పరుగే తీయలేదు. మొత్తం భాగస్వామ్యం 29.2 ఓవర్లలో 23 మాత్రమే! భారత జట్టులో అసహనం పెరిగిపోతుండగా... ప్రేక్షకులకు పిచ్చెక్కిపోతుండగా, ఇద్దరు బ్యాట్స్‌మెన్ అడ్డంగా నిలబడి నాలుగో రోజు ముగించారు.

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఆదివారం దక్షిణాఫ్రికా ఆటను చూస్తే ‘కోట గోడ’ కూడా ఇంత దుర్భేద్యంగా ఉండదేమో అనిపిస్తుంది. డిఫెన్స్... డిఫెన్స్... డిఫెన్స్... ఏ బంతినైనా, ఎలాంటి బంతినైనా అడ్డుకోవడం ఒక్కటే పని. కాస్త పరుగులు చేయండయ్యా బాబూ అన్నట్లుగా ఫుల్‌టాస్‌లు వేసినా... ఎన్నడూ బౌలింగ్ చేయనివారికి బంతి అప్పగించినా... ఊహూ, మేం కొట్టమంటే కొట్టం అన్నట్లుగా కనిపించింది ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు.

అసాధ్యమైన 481 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేమని గుర్తించిన సఫారీలు ‘డ్రా’ కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. సిరీస్ చివరికి వచ్చిన తర్వాత ఆ జట్టు అనూహ్య ప్రతిఘటన కనబర్చింది. బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం ఏ మాత్రం ప్రయత్నించకపోవడంతో బౌలర్లకు ఫలం దక్కలేదు. అయినా సరే... ఇప్పటికీ కోహ్లి సేనదే పైచేయి. ఆట చివరిరోజు సోమవారం ఆమ్లా, డివిలియర్స్ జోడీని విడదీస్తే మిగిలిన వికెట్లు పడగొట్టడం భారత జట్టుకు సమస్య కాబోదు.
 
- పోరాడుతున్న దక్షిణాఫ్రికా
- లక్ష్యం 481 పరుగులు
- రెండో ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 72/2
- ఆమ్లా, డివిలియర్స్ దుర్భేద్య డిఫెన్స్  
- ఐదో రోజుకు చేరిన చివరి టెస్టు
- రహానే రెండో శతకం
 
న్యూఢిల్లీ:
భారత్‌లో దక్షిణాఫ్రికా 72 రోజుల సుదీర్ఘ పర్యటన చివరి సీన్‌కు చేరింది. అయితే ఏకపక్షంగా సాగిన మొదటి మూడు మ్యాచ్‌లతో పోలిస్తే అనూహ్య మలుపు తీసుకున్న ఢిల్లీ టెస్టులో ఆఖరి రోజు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

విజయం కోసం 481 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కెప్టెన్ హషీం ఆమ్లా (207 బంతుల్లో 23 బ్యాటింగ్; 3 ఫోర్లు), ఏబీ డివిలియర్స్ (91 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు 409 పరుగులు చేయడం దాదాపు అసాధ్యం కాబట్టి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాలని పట్టుదలగా ఉన్న సఫారీలు అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే కోహ్లి సేన మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టి విజయం సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది.

అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 267 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రహానే (206 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, కోహ్లి (165 బంతుల్లో 88; 10 ఫోర్లు) శతకాన్ని చేజార్చుకున్నాడు.

స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 334
 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 121
 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) విలాస్ (బి) మోర్కెల్ 3; ధావన్ (బి) మోర్కెల్ 21; రోహిత్ (బి) మోర్కెల్ 0; పుజారా (బి) తాహిర్ 28; కోహ్లి (ఎల్బీ) (బి) అబాట్ 88; రహానే (నాటౌట్) 100; సాహా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (100.1 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్) 267.
 వికెట్ల పతనం: 1-4; 2-8; 3-53; 4-57; 5-211.
 బౌలింగ్: మోర్కెల్ 21-6-51-3; అబాట్ 22-9-47-1; పీడిట్ 18-1-53-0; తాహిర్ 26.1-4-74-1; ఎల్గర్ 13-1-40-0.
 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) రహానే (బి) అశ్విన్ 4; బవుమా (బి) అశ్విన్ 34; ఆమ్లా (బ్యాటింగ్) 23; డివిలియర్స్ (బ్యాటింగ్) 11; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (72 ఓవర్లలో 2 వికెట్లకు) 72.
 వికెట్ల పతనం: 1-5; 2-49.
 బౌలింగ్: ఇషాంత్ 12-7-16-0; అశ్విన్ 23-13-29-2; జడేజా 23-16-10-0;  ఉమేశ్ 9-6-6-0; శిఖర్ ధావన్ 3-1-9-0; మురళీ విజయ్ 2-0-2-0.
 
 
తొలి సెషన్: రహానే సెంచరీ
ఓవర్‌నైట్ స్కోరు 190/4తో ఆట ప్రారంభించిన భారత్ మరో 77 పరుగులు జోడించింది. ఐదో ఓవర్‌లోనే అబాట్ బంతికి కోహ్లి వెనుదిరిగాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన రహానే 54 బంతుల్లోనే 48 పరుగులు చేసి మ్యాచ్‌లో రెండో సెంచరీ అందుకున్నాడు. తాహిర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి రహానే శతకం పూర్తి చేయగానే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఎల్గర్ (4)ను అశ్విన్ పెవిలియన్ పంపించాడు.
 ఓవర్లు: 19.1, పరుగులు: 77, వికెట్లు: 1 (భారత్)
 ఓవర్లు: 5, పరుగులు: 5, వికెట్లు: 1 (దక్షిణాఫ్రికా)

రెండో సెషన్: మెయిడిన్ల జాతర
లంచ్ అనంతరం బవుమా (117 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆమ్లా కలిసి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఎక్కడా పరుగు తీయకుండా డిఫెన్స్‌కే కట్టుబడ్డారు. పొరపాటున బౌలర్ల చేతి నుంచి బంతి జారి పరుగులు రావడం తప్ప... ఈ సెషన్‌లో భారత్ ఏకంగా 18 మెయిడిన్లు విసిరింది. చివరకు వికెట్ లేకుండానే సెషన్ ముగిసింది.
 ఓవర్లు: 34, పరుగులు: 35, వికెట్లు: 0 (దక్షిణాఫ్రికా)
 
మూడో సెషన్: ఆమ్లా, ఏబీ సహనం
విరామం తర్వాత ఎట్టకేలకు బవుమాను అశ్విన్ బౌల్డ్ చేయడంతో భారత్‌కు ఊరట లభించింది. కానీ ఆ తర్వాత ఆమ్లా, ఏబీ గట్టిగా నిలబడ్డారు. బ్యాట్స్‌మెన్ చుట్టూ ఫీల్డర్లను మోహరించి కోహ్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడి సమర్థంగా అడ్డుకుంది. ఆట ముగిసే సమయానికి  వీరిద్దరు నెమ్మదిగా ఆడటంలో పలు రికార్డులు సవరించారు.
 ఓవర్లు: 33, పరుగులు: 32, వికెట్లు: 1 (దక్షిణాఫ్రికా)
 
 

  • ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్ రహానే. అంతకుముందు విజయ్ హజారే, గవాస్కర్ (3 సార్లు), ద్రవిడ్ (2 సార్లు), కోహ్లి ఈ ఘనత సాధించారు.
  • కనీసం 50 ఓవర్లు ఆడిన టెస్టు ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా రన్‌రేట్ (1.00 పరుగు) రెండో అత్యల్పం.
  • ఆమ్లా  11.11 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 200 బంతులు ఎదుర్కొన్న తర్వాత ఇంత నెమ్మదిగా ఎవరూ ఆడలేదు. ఆమ్లా, డివిలియర్స్ మధ్య కూడా అత్యంత నెమ్మదైన భాగస్వామ్యం (176 బంతుల్లో 23 పరుగులు) నమోదైంది.  

 
‘దక్షిణాఫ్రికా ఇలా ఆడటం చాలా ఆశ్చర్యం కలిగిం చింది. పరుగులు వచ్చే సునాయాస బంతులను కూడా వారు డిఫెన్స్ ఆడారు. పిచ్ నిజంగానే బౌలింగ్‌కు అనుకూలంగా లేదు. అయితే వారు మరో రోజంతా అలా ఆడలేరు. ఎక్కడో ఒక చోట తప్పులు చేస్తారని, మేం గెలుస్తామని నమ్మకముంది.’    -ఉమేశ్ యాదవ్, భారత బౌలర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement