శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా ఘనవిజయంతో ఆరంభించింది.
పోర్ట్ ఎలిజబెత్: శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా ఘనవిజయంతో ఆరంభించింది. శనివారం జరిగిన తొలి వన్డేలో ప్రొటీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గి 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 48.3 ఓవర్లలో 181 పరుగులకు కుప్పకూలింది. పార్నెల్ (3/48), తాహిర్ (3/26)ల ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ చేతులెత్తేసింది. మెండిస్ (94 బంతుల్లో 62; 10 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం స్వల్ప లక్ష్యానికి బరిలోకి దిగిన సఫారీలు 34.2 ఓవర్లలో రెండు వికెట్లకు 185 పరుగులు చేసి గెలిచింది. ఆమ్లా (71 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), డుప్లెసిస్ (68 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా డి కాక్ (40 బంతుల్లో 34; 4 ఫోర్లు), డి విలియర్స్ (27 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకారం అందించారు. రెండో వన్డే ఫిబ్రవరి1న డర్బన్‌లో జరుగుతుంది.