
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా– ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు మళ్లీ జీవం వచ్చింది! అద్భుతమైన బౌలింగ్‌తో రెండో టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పని పట్టిన యువ పేసర్ కగిసో రబడ గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. తనపై విధించిన రెండు టెస్టుల నిషేధంపై రబడ చేసిన అప్పీల్‌లో ఫలితం అతనికి అనుకూలంగా వచ్చింది. సోమవారం దాదాపు ఆరు గంటల పాటు రబడ విచారణ సాగింది. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రఖ్యాత న్యాయవాది డాలి ఎంపొఫూ తమ పేసర్ తరఫున వాదించారు. పోర్ట్ ఎలిజబెత్ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్‌ను ఉద్దేశపూర్వకంగా తాను ఢీకొట్టలేదంటూ రబడ పదే పదే చెప్పాడు. ఈ వాదనతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్పీల్ కమిషనర్ మైకేల్ హెరాన్ ఏకీభవించారు. వీడియోలో కూడా అతను కావాలని చేసినట్లుగా లేదని హెరాన్ తేల్చారు. దాంతో రబడపై విధించిన మూడు డీమెరిట్ పాయింట్ల శిక్షను ఒక డీమెరిట్ పాయింట్‌కు తగ్గించడంతో పాటు మ్యాచ్ ఫీజులో 25 శాతాన్ని మాత్రమే జరిమానాగా విధించారు. దాంతో రబడ డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఫలితంగా రెండు టెస్టుల నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. రెండో టెస్టులో 11 వికెట్లతో సఫారీలకు విజయాన్ని అందించిన రబడ సిరీస్‌కు దూరమైతే ఆ జట్టు పరిస్థితి మిగిలిన రెండు టెస్టుల్లో ఇబ్బందికరంగా ఉండేది. అయితే తాజా తీర్పుతో సఫారీ సేన ఊపిరి పీల్చుకుంది. రేపటి నుంచి కేప్‌టౌన్‌లో మూడో టెస్టు జరుగుతుంది.
అయితే ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాకు ఊరట లభించినా ప్రమాదం ఇంకా పూర్తిగా దాటిపోలేదు. పోర్ట్ ఎలిజబెత్ టెస్టులో స్మిత్ ఘటన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ను దూషించినందుకు మరో డీమెరిట్ పాయింట్ రబడ ఖాతాలో చేరింది. దాంతో ప్రస్తుతం అతని పాయింట్ల సంఖ్య ఏడు వద్ద నిలిచింది. మూడో టెస్టులో ఏ దశలోనైనా పరిధి దాటితే మరో పాయింట్ చేరి మళ్లీ నిషేధం పడవచ్చు. అందువల్ల రబడను అదుపులో ఉంచాల్సిన బాధ్యత డుప్లెసిస్, అతని సహచరులపైనే ఉంది.