రాహుల్‌ పోరాటం | Indias first Test against South Africa | Sakshi
Sakshi News home page

రాహుల్‌ పోరాటం

Published Wed, Dec 27 2023 4:09 AM | Last Updated on Wed, Dec 27 2023 4:09 AM

Indias first Test against South Africa - Sakshi

‘బాక్సింగ్‌ డే’ టెస్టు సవాళ్లతో మొదలైంది. బంతి ఒక బుల్లెట్‌గా బ్యాటర్లను అదేపనిగా ఢీకొట్టింది. పేసర్లు గర్జిస్తుంటే... ప్రధాన బ్యాటర్లు సైతం చేతులెత్తేశారు. అడుగడుగునా కఠిన సవాళ్లు ఎదురవుతున్న సెంచూరియన్‌ పిచ్‌పై మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్‌ రాహుల్‌ అసాధారణ పోరాటం చేశాడు. అజేయ అర్ధ సెంచరీతో భారత్‌ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు.  

సెంచూరియన్‌: సఫారీ పేస్‌ దళానికి భారత బ్యాటింగ్‌ బలగమంతా వణికితే ఒకే ఒక్కడు కేఎల్‌ రాహుల్‌ మాత్రం పెను సవాలుకు తన బ్యాటింగ్‌ సత్తాతో ఎదురు నిలిచాడు. తొలిటెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ వర్షం కారణంగా ఆట నిలిచి సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

కేఎల్‌ రాహుల్‌ (105 బంతుల్లో 70 బ్యాటింగ్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్‌ మొదటిరోజే ఆలౌట్‌ కాకుండా అడ్డుపడ్డాడు. అజేయ అర్ధసెంచరీతో ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. రబడ ఐదు వికెట్లతో (5/44) చెలరేగాడు. ఈ మ్యాచ్‌ ద్వారా భారత యువ సీమర్‌ ప్రసిధ్‌ కృష్ణ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.  

రోహిత్‌ 5, గిల్‌ 2 
టాస్‌ నెగ్గిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. సీమర్లు తమ కెప్టెన్‌ నిర్ణయం సరైందనిపించడానికి ఎంతో సేపు పట్టలేదు. కెపె్టన్‌ రోహిత్‌ శర్మ (5)ను రబడ అవుట్‌ చేయగా, కాసేపటికే బర్గర్‌ వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్‌ (17), శుబ్‌మన్‌ గిల్‌ (2)లను పెవిలియన్‌ చేర్చాడు.

24 పరుగులకే టీమిండియా విలువైన వికెట్లు కూలాయి. ఈ దశలో అనుభవజు్ఞడైన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (64 బంతుల్లో 38; 5 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (50 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ను కనిపెట్టుకున్నారు. తొలిసెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుకున్నారు. భారత్‌ 91/3 స్కోరు వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.  

రబడ దెబ్బకు మళ్లీ... 
అదేంటో ఏమో మ్యాచ్‌ మొదలైనపుడు కష్టాల్లో పడ్డట్లే... రెండో సెషన్‌ మొదలైనపుడు కూడా భారత్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కలిసొచ్చిన పిచ్‌... పనికొచ్చిన ఎక్స్‌ట్రా బౌన్స్‌తో వైవిధ్యమైన బంతులు వేసిన రబడ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా నియంత్రణలోకి తెచ్చాడు. సెషన్‌ ఆరంభమైన ఓవర్లోనే అయ్యర్, జట్టు స్కోరు వంద పూర్తయ్యాక కోహ్లి, అశ్విన్ (8)లను రబడ  పెవిలియన్‌ చేర్చాడు. ఓ దశలో 121/6 స్కోరు వద్ద భారత్‌ ఆలౌట్‌కు దాదాపు చేరువైంది. ఎందుకంటే ఒక్క రాహుల్‌ మినహా ప్రధాన బ్యాటర్లెవరూ మిగల్లేదు! 

వీరోచిత పోరాటం 
కష్టమైన పిచ్‌... నిప్పులు చెరుగుతున్న బౌలర్లు... భారత్‌కు అన్నీ కష్టాలే! ఇలాంటి పరిస్థితిలో రాహుల్‌ అద్వితీయ పోరాటం చేశాడు. కీలక బ్యాటర్లెవరూ లేకపోయినా... టెయిలెండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (33 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో రెండో సెషన్‌ను నడిపించాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో శార్దుల్‌ వికెట్‌ను పారేసుకున్నాడు. బుమ్రా క్రీజులోకి రాగా... టీమిండియా 176/7 వద్ద టీ బ్రేక్‌కు వెళ్లింది.

విరామనంతరం రాహుల్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కాసేపటికే బుమ్రా (1)ను జాన్సెన్‌ బౌల్డ్‌ చేశాడు. సిరాజ్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులోకి రాగా... రాహుల్‌ కష్టపడి జట్టు స్కోరును 200 దాటించాడు. బ్యాడ్‌లైట్, వర్షం వల్ల ఫైనల్‌ సెషన్‌ ఎక్కువసేపు సాగలేదు. 208/8 స్కోరు వద్ద వాన రావడంతో తొలిరోజు ఆట అక్కడితోనే ఆగిపోయింది. మ్యాచ్‌ ఆరంభం కూడా ఆలస్యం కావడంతో మొదటి రోజు కేవలం 59 ఓవర్ల ఆటే సాధ్యమైంది. 

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: యశస్వి (సి) వెరిన్‌ (బి) బర్గర్‌ 17; రోహిత్‌ (సి) బర్గర్‌ (బి) రబడ 5; గిల్‌ (సి) వెరిన్‌ (బి) బర్గర్‌ 2; కోహ్లి (సి) వెరిన్‌ (బి) రబడ 38; అయ్యర్‌ (బి) రబడ 31; రాహుల్‌ (బ్యాటింగ్‌) 70; అశ్విన్ (సి) సబ్‌–ముల్డర్‌ (బి) రబడ 8; శార్దుల్‌ (సి) ఎల్గర్‌ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్‌ 1; సిరాజ్‌ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 208. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191. బౌలింగ్‌: రబడ 17–3–44–5, మార్కొ జాన్సెన్‌ 15–1–52–1, బర్గర్‌ 15–4–50–2, కొయెట్జీ 12–1–53–0.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement