
ఇప్పటికైనా మేల్కొండి: రణతుంగ
ఇటీవల కాలంలో శ్రీలంక సాధిస్తున్న విజయాల్లో స్పిన్నర్ల పాత్రే అధికంగా ఉండటం జట్టుకు ఎంతమాత్రం మంచిది కాదని మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అభిప్రాయపడ్డాడు.
కొలంబో: ఇటీవల కాలంలో శ్రీలంక సాధిస్తున్న విజయాల్లో స్పిన్నర్ల పాత్రే అధికంగా ఉండటం జట్టుకు ఎంతమాత్రం మంచిది కాదని మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అభిప్రాయపడ్డాడు. ఇలా కేవలం స్పిన్నర్లపైనే ఆధారపడితే కీలక మ్యాచ్ల్లో రాణించడం కష్టమన్నాడు. రాబోవు వన్డే వరల్డ్ కప్ ఇంగ్లండ్లో జరుగునున్న నేపథ్యంలో అక్కడ పిచ్లు ఎంతమాత్రం స్పిన్కు అనుకూలించవనే అంశం గుర్తించాలన్నాడు. ఇప్పటికైనా శ్రీలంక మేల్కొని ఫాస్ట్ బౌలింగ్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నాడు. దాంతోపాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ను పటిష్టంగా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.
' లంకేయుల ప్రతిభను ఏమాత్రం తక్కువ చేయడం లేదు. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ను శ్రీలంక క్లీన్స్వీప్ చేసింది. అది గర్వించదగ్గ అంశమే. అయితే పొరుగు దేశాల్లో ఆడేటప్పుడు లంకేయులకు అసలైన సవాల్ ఉంటుంది. ఇటీవల కాలంలో లంక సాధించిన విజయాలు స్పిన్నర్లు కారణంగా వచ్చినవే. డెత్ ఓవర్లలో బౌలింగ్ వేసే సరైన పేస్ బౌలర్ శ్రీలంక జట్టులో లేడు. శ్రీలంక క్రికెట్ బోర్డు పేస్ విభాగంపై సీరియస్గా దృష్టి కేంద్రీకరించాల్సి వుంది' అని రణతుంగా తెలిపాడు.