మరోసారి ఆఖరి బంతికే | sri lanka beat by ausis in last ball | Sakshi
Sakshi News home page

మరోసారి ఆఖరి బంతికే

Published Mon, Feb 20 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

మరోసారి ఆఖరి బంతికే

మరోసారి ఆఖరి బంతికే

గుణరత్నే మెరుపు బ్యాటింగ్‌
రెండో టి20లో ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం


గీలాంగ్‌: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లోనూ శ్రీలంక జట్టు మరోసారి ఆఖరి బంతికే నెగ్గింది. తొలి మ్యాచ్‌లాగే ఈసారీ అసేల గుణరత్నే (46 బంతుల్లో 84 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. 174 పరుగుల భారీ లక్ష్యంతో బరి లోకి దిగిన లంక తొలి ఐదు ఓవర్లలోనే 41 పరుగులకు ఐదు వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితిలో బరిలోకి దిగిన గుణరత్నే మిగతా 15 ఓవర్లలో తన అసమాన బ్యాటింగ్‌తో లంకకు రెండు వికెట్ల తేడాతో గెలుపునందించి ఆసీస్‌ ఆటగాళ్లను షాక్‌కు గురి చేశాడు. చివరి రెండు ఓవర్లలో 36 పరుగులు కావాల్సిన దశలో ఐదు బంతుల్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాది 22 పరుగులు రాబట్టాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు రావాల్సి ఉండగా తొలి బంతికే కులశేఖర (12) అవుటయ్యాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో ఫోర్, సిక్స్‌తో పాటు చివరి బంతికి రెండు పరుగులు రావాల్సి ఉండగా మరో ఫోర్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో మూడు టి20ల సిరీస్‌ను లంక 2–0తో మరో మ్యాచ్‌ ఉండగానే దక్కించుకుంది. బుధవారం అడిలైడ్‌లో చివరి మ్యాచ్‌ జరుగుతుంది.

ఆసీస్‌ గడ్డపై తమ చివరి ఐదు టి20ల్లోనూ లంకకు పరాజయం లేకపోవడం విశేషం. అంతకుముందు ఆసీస్‌ 20 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. హెన్రిక్స్‌ (37 బంతుల్లో 56; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), క్లింగర్‌ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌స్కోరర్లు. ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కులశేఖర నాలుగు, మలింగ.. బండారులకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 176 పరుగులు చేసి నెగ్గింది. కపుగెడెర (32 బంతుల్లో 32; 4 ఫోర్లు) సహకారం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement