
కొలంబో: దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంక పర్యటనను పరాజయంతో ముగించింది. ఏకైక టి20 మ్యాచ్‌లో లంక 3 వికెట్ల తేడాతో సఫారీని ఓడించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ డికాక్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా... హెండ్రిక్స్ 19, క్లాసెన్ 18 పరుగులు చేశారు. ఆతిథ్య బౌలర్లు సమష్టిగా దక్షిణాఫ్రికా భరతం పట్టారు. దీంతో ఏ ఒక్కరు క్రీజులో నిలిచే సాహసం చేయలేకపోయారు.
రెండో ఓవర్లోనే ఆమ్లా డకౌట్‌తో ప్రారంభమైన దక్షిణాఫ్రికా పతనం 16.4 ఓవర్లలో షమ్సీ డకౌట్‌తో ముగిసింది. లంక బౌలర్లలో సందకన్ 3 వికెట్లు పడగొట్టగా, ధనంజయ డిసిల్వా, అఖిల ధనంజయ చెరో 2 వికెట్లు తీశారు. లక్ష్యం సునాయాసంగానే కనిపించినా... పిచ్ పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక చెమటోడ్చింది. తొలి ఓవర్లోనే కుశాల్ పెరీరా (3), మెండిస్ (1) నిష్క్రమించడంతో ఆతిథ్య జట్టు కష్టాలు మొదలయ్యాయి. అయితే చండిమాల్ (33 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1సిక్స్), ధనంజయ డిసిల్వా (26 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరిస్థితిని చక్కదిద్దారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, షమ్సీ, డాలా తలా రెండు వికెట్లు తీశారు. ధనంజయ డిసిల్వాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.