న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో డిపార్ట్‌మెంట్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణి క్రీడాకారులు ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున పోటీపడుతున్న రాష్ట్ర ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్, చేతన్ ఆనంద్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.
శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో... ఈ ఏడాది థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ విజేత శ్రీకాంత్ 21-6, 21-5తో అమీర్ సుమారా (గుజరాత్)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ కశ్యప్ 21-4, 21-7తో తేజన్ ఫలారే (గోవా)పై, రెండో సీడ్ గురుసాయిదత్ 21-4, 21-7తో సన్నీ సావంత్ (గోవా)పై, క్వాలిఫయర్, మూడుసార్లు జాతీయ మాజీ చాంపియన్ చేతన్ ఆనంద్ 21-5, 21-5తో హిరాక్ జ్యోతి (అస్సాం)పై నెగ్గారు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో ఏపీ ఆటగాడు అజయ్ కుమార్ 21-14, 21-9తో కేతన్ చహల్ (హర్యానా)ను ఓడించాడు.
శ్రీ కృష్ణప్రియ ముందంజ
మహిళల సింగిల్స్ విభాగంలో ఏపీ క్రీడాకారిణులు శ్రీ కృష్ణప్రియ, రుత్విక శివానిలతోపాటు పీఎస్‌పీబీకి ఆడుతోన్న తెలుగు అమ్మాయి పి.వి.సింధు మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడుతోన్న శ్రీ కృష్ణప్రియ రెండో రౌండ్‌లో 21-16, 17-21, 21-13తో కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్)ను ఓడించగా... రుత్విక శివాని 21-12, 21-11తో రీతూ వినాయర్ (పంజాబ్)పై, రెండో సీడ్ సింధు 21-3, 21-5తో జైసీ బ్రిగెట్టి (పాండిచ్చేరి)పై విజయం సాధించారు.
మూడో రౌండ్‌లో శ్రీకాంత్
Published Sat, Dec 21 2013 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement