శ్రీకాంత్ ,గురుసాయిదత్
న్యూఢిల్లీ: ఈసారి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనున్నాడు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్‌లో శ్రీకాంత్ 21-14, 21-19తో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ (పీఎస్‌పీబీ)ను బోల్తా కొట్టించగా... గురుసాయిదత్ 21-13, 21-19తో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు భమిడిపాటి సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ)పై గెలుపొందాడు.
మహిళల సింగిల్స్ విభాగం టైటిల్ కూడా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణుల ఖాతాలోనే చేరనుంది. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్, 2011 జాతీయ చాంపియన్ పి.వి.సింధు (పీఎస్‌పీబీ) 21-17, 21-14తో అరుంధతి పంతవానె (మహారాష్ట్ర)పై, రీతూపర్ణ దాస్ (ఆంధ్రప్రదేశ్) 13-21, 21-13, 21-14తో సయాలీ గోఖలే (ఎయిరిండియా)పై గెలిచారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (ఏఏఐ); గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (పీఎస్‌పీబీ) జోడిలు ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)-మనూ అత్రి (ఏఏఐ); ప్రణవ్ చోప్రా (పీఎస్‌పీబీ)-అక్షయ్ దివాల్కర్ (ఎయిరిండియా) జంటలు టైటిల్ కోసం పోటీపడతాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో తరుణ్ కోనా-అశ్విని పొనప్ప (పీఎస్‌పీబీ), అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ) జోడిలు ఫైనల్లోకి చేరుకున్నాయి. అన్ని విభాగాల ఫైనల్స్ సోమవారం జరుగుతాయి.