సాయిప్రణీత్
న్యూఢిల్లీ: తమ విజయపరంపరను కొనసాగిస్తూ... జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిపార్ట్‌మెంట్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాయిప్రణీత్, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన నాలుగో రౌండ్‌లో ఆరో సీడ్ సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ) 11-21, 21-13, 21-17తో సమీర్ వర్మ (మధ్యప్రదేశ్)పై గెలిచాడు.
ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్ (పీఎస్‌పీబీ) 21-14, 21-13తో శుభాంకర్ డే (మహారాష్ట్ర)పై, గురుసాయిదత్ 21-10, 21-6తో అజయ్ కుమార్ (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గారు. రోహిత్ యాదవ్ (ఏఏఐ)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 11-7తో ఆధిక్యంలో ఉన్నదశలో గాయంతో అతని ప్రత్యర్థి వైదొలిగాడు. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ (పీఎస్‌పీబీ)తో కశ్యప్; ఆనంద్ పవార్ (ఎయిరిండియా)తో శ్రీకాంత్; అజయ్ జయరామ్ (పీఎస్‌పీబీ)తో సాయిప్రణీత్; సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ)తో గురుసాయిదత్ తలపడతారు.
సింధు జోరు
మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. నాలుగో రౌండ్‌లో సింధు 21-3, 21-7తో ముద్ర ధైన్‌జి (ఎయిరిండియా)ను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రుత్విక శివాని నాలుగో రౌండ్‌లో... శ్రీ కృష్ణప్రియ మూడో రౌండ్‌లో ఓడిపోయారు. సైలి రాణే (ఎయిరిండియా)తో జరిగిన మ్యాచ్‌లో రుత్విక 9-14తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. శ్రీ కృష్ణప్రియ 19-21, 23-25తో జాక్వలైన్ రోజ్ (కర్ణాటక) చేతిలో పోరాడి ఓడింది.
జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగాల్ అమ్మాయి రీతూపర్ణ దాస్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నాలుగో రౌండ్‌లో రీతూపర్ణ దాస్ 21-12, 2-1తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి శ్రేయాన్షి పరదేశి (ఎయిరిండియా) వైదొలిగింది. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరతి సారా సునీల్ (కేరళ)తో సయాలీ గోఖలే (ఎయిరిండియా); తన్వీ లాడ్ (ఎయిరిండియా)తో రీతూపర్ణ దాస్; సైలి రాణేతో అరుంధతి పంతవానె (మహారాష్ట్ర); పి.సి.తులసీ (కేరళ)తో సింధు పోటీపడతారు.