
పెర్త్: ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ మరోసారి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించిన స్టార్క్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు సాధించి కివీస్ పతనాన్ని శాసించాడు. స్టార్క్ దెబ్బకు 468 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆసీస్ 296 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో వాట్లింగ్(40), గ్రాండ్ హోమ్(33)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. మిగతా వారు విఫలం కావడంతో కివీస్ ఘోర పరాజయం తప్పలేదు.
ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌ను 217/9 వద్ద డిక్లేర్డ్ చేయడంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఏమాత్రం పోరాడలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడిపోయింది. స్టార్క్‌కు జతగా నాథన్ లయన్ నాలుగు వికెట్లు సాధించడంతో కివీస్ రెండొందల పరుగుల మార్కును కూడా చేరలేకపోయింది. కమ్మిన్స్ రెండు వికెట్లు సాధించాడు. 167/6 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ మరో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దాంతో ఆసీస్‌కు 467 పరుగుల ఆధిక్యం లభించింది. ఆపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ పేకమేడలా కుప్పకూలింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.