
స్టీఫెన్ రికార్డు
ఆంధ్ర జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ చీపురుపల్లి వీరరాఘవులు స్టీఫెన్ టి20 క్రికెట్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు.
వడోదర: ఆంధ్ర జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ చీపురుపల్లి వీరరాఘవులు స్టీఫెన్ టి20 క్రికెట్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో అతను ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా గురువారం ఇక్కడ అస్సాంతో జరిగిన గ్రూప్ ‘సి’మ్యాచ్‌లో స్టీఫెన్ 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం మరో విశేషం. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీపై 5 వికెట్లు తీసిన స్టీఫెన్... ఆ తర్వాత సోమవారం రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ టి20 చరిత్రలో ఏ బౌలర్ కూడా వరుసగా మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు తీయలేదు. ఇప్పటి వరకు ఆంధ్ర తరఫున తన 13 మ్యాచ్‌ల టి20 కెరీర్‌లో స్టీఫెన్ 10.91 సగటుతో 24 వికెట్లు పడగొట్టాడు.
తొలి విజయం
ముస్తాక్ అలీ టోర్నీలో మూడు పరాజయాల తర్వాత ఆంధ్రకు తొలి విజయం దక్కింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 12 పరుగుల తేడాతో అస్సాంను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఏజీ ప్రదీప్ (23 బంతుల్లో 26; 4 ఫోర్లు) టాప్ స్కోర్. సయ్యద్ మొహమ్మద్ (3/15) రాణించాడు. అనంతరం అస్సాం 19.3 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. సయ్యద్ మొహమ్మద్ (38 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. విజయం కోసం చివరి ఓవర్లో అస్సాం 13 పరుగులు చేయాల్సి ఉండగా... తొలి మూడు బంతులకే అహ్మద్, మొహమ్మద్, దాస్‌లను అవుట్ చేసి స్టీఫెన్ అస్సాం ఇన్నింగ్స్‌కు తెర దించాడు.