సిడ్నీ: త్వరలో స్వదేశంలో ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఆ దేశ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా పలు సూచనలు చేశాడు. ప్రధానంగా ఆ సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందంటూ హెచ్చరికలు జారీ చేశాడు. తన శారీరక భాషలో కానీ, మాటల ద్వారా కానీ స్టీవ్ స్మిత్ ఏమాత్రం సహనాన్నికోల్పోకుండా హుందాగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు.
' యాషెస్ ఎప్పుడూ ప్రతిష్టాత్మకమే. ఇదొక హై ఓల్టేజ్ సిరీస్. యాషెస్ సిరీస్ లో ఆసీస్ ఆటగాళ్లు వారి వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ స్మిత్ తన ఎమోషన్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కెమెరాలు నిన్నే కనిపెడతాయి. ఒక ఆసీస్ కెప్టెన్ గా నువ్వు ఫీల్డ్ లో ఎలా ఉంటున్నావన్నది కెమెరాలు వాచ్ చేస్తూనే ఉంటాయి. మనల్ని మనం తక్కువ చేసుకునే అవకాశం కెమెరాలకు దయచేసి ఇవ్వొద్దు. నీ ప్రతీ కదిలిక బిగ్ స్క్రీన్ పై రిప్లేలో ఐదు నిమిషాలు పాటు జట్టు మొత్తం చూస్తుంది. అటు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ జాగ్రత్తగా ఉండు. ప్రధానంగా ఫీల్డర్లు క్యాచ్ లు జారవిడిచినప్పుడు కానీ, బౌలర్లు బాగా బౌలింగ్ చేయలేనప్పుడు కానీ ఎక్కువ ఎమోషన్ కావొద్దు. ఫీల్డ్ లో నిన్ను నీవు అంచనా వేసుకుంటూ ముందుకు సాగడమే ఉత్తమం. ఇదే నీకు నేనిచ్చే సలహా' అని స్టీవ్ వా పేర్కొన్నాడు. వచ్చే నెల 23 వ తేదీ నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment