
స్టీవ్ స్మిత్
సాక్షి, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ నిషేధం ఎత్తివేయడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో రబడ స్మిత్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడని తొలుత ఐసీసీ రెండు టెస్టుల నిషేదం విధించిన విషయం తెలిసిందే.
దీనిపై రబడా అప్పీల్ చేయగా విచారించిన అప్పీల్ కమిషనర్ మైకేల్ హెరాన్ నిషేదాన్ని ఎత్తి వేస్తూ రబడకు అనుకూలంగా తీర్పునిచ్చాడు. దీంతో రబడ గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. అయితే ఈ తీర్పును స్మిత్ తప్పుబట్టాడు.
రబడ తనని ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడని, ఇది వీడియోలో స్పష్టంగా తెలుస్తుందన్నాడు. వికెట్ పడగొట్టిన తర్వాత బౌలర్ల ఆనందం తనకు తెలుసని, కానీ ఓవర్‌గా రియాక్ట్ కావడం అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి విషయాల్లో ఐసీసీ కఠినంగా వ్యవహరించాలని సూచించాడు. విచారణలో తన వాదనలు వినకపోవడం ఆశ్చర్యం కలిగించిందని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో రబడ తన బౌలింగ్‌తో ఆసీస్ పతనాన్ని శాసిస్తున్నాడు. రెండు మ్యాచుల్లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు.