బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్!
సుప్రీం కోర్టు సలహా
శ్రీనివాసన్‌ను తప్పించాల్సిందే
చెన్నై, రాజస్థాన్ జట్లను సస్పెండ్ చేయాలి
బోర్డు ఒప్పుకుంటే మధ్యంతర ఉత్తర్వులు
రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో గురువారం సుప్రీం కోర్టు కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. శ్రీనివాసన్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి గవాస్కర్ లేదా అలాంటి క్రికెట్ అనుభవం ఉన్న వ్యక్తులకు కట్టబెట్టాలని సూచింది. దీంతో ఓవరాల్‌గా శ్రీనికి పదవి గండం తప్పేలా లేదు. మాజీ ఆటగాళ్లు కూడా కోర్టు ప్రతిపాదనలకే మొగ్గు చూపుతుండటంతో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
‘దోషులుగా నిర్ధారణ అయ్యేవరకు ఎవరైనా అమాయకులే. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. సుప్రీం కోర్టు చేసిన సూచనలను పాటించాలి. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దీనికోసం బోర్డుతో వ్యాఖ్యాతగా ఉన్న కాంట్రాక్టును కూడా వదులుకుంటా. క్రికెట్‌లో ఓపెనర్ శారీరకంగా, మానసికంగా అన్ని సవాళ్లను ఎదుర్కోవాలి. ఓపెనర్‌గా ఆడిన నేను ఏ సవాల్‌కైనా సిద్ధమే. రెండు జట్లను దూరంగా ఉంచినంత మాత్రాన అవినీతి రహిత క్రికెట్ సాధ్యమవుతందని నేను అనుకోను. ఐపీఎల్‌లో చెన్నై, రాజస్థాన్ జట్లు లేకపోతే అభిమానులు నిరాశ చెందుతారు. 1999-2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం బయటపడినప్పుడు టెస్టు క్రికెట్ ఆడొద్దని ఎవరూ చెప్పలేదు. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి వాటిని నిరోధించవచ్చు.’
- గవాస్కర్
మాజీ ఆటగాళ్లు, బోర్డు సభ్యులు సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనలను సమర్థించారు. కోర్టు వెలువరించే తుది ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనని వారు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై వారి స్పందన...
చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేయడానికి శ్రీనివాసన్‌కు అనుమతినివ్వడం బీసీసీఐ చేసిన మొదటి తప్పు. అప్పట్లో అతను జట్టును కొనుగోలు చేయకుండా అడ్డుకుంటే బాగుండేది.
- రవిసావంత్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు
బీసీసీఐకి ఇది దురదృష్టకరమైన రోజు. పరిస్థితి చేయిదాటి పోయింది. క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ శిరసావహించాల్సిందే.
- నిరంజన్ షా, బీసీసీఐ మాజీ కార్యదర్శి
ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఈ స్థితిలో ఏ అంశంపైనా నేను ఎక్కువగా స్పందించలేను.
- శ్రీకాంత్, మాజీ చీఫ్ సెలక్టర్
బీసీసీఐ ప్రతిపాదనలేమిటో నేను చూడలేదు. కోర్టు నిర్ణయం వెలువరించేంతవరకు అంతా ఎదురుచూడాలి. దీనిపై నేను ఎలాంటి వ్యాఖ్య చేయను.
- ద్రవిడ్, మాజీ కెప్టెన్
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే అవి ఆటను దెబ్బతీయలేవు. ఇతర రంగాల లాగే క్రికెట్‌లోనూ తప్పులు జరిగి ఉండొచ్చు.
- అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ పదవికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు గురువారం మరికొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. బోర్డులో సమూల మార్పులు చేయాలని ఆదేశించడంతో పాటు శ్రీనివాసన్‌ను పదవి నుంచి తప్పించాలని సూచించింది. కేసు పరిష్కారమయ్యే వరకు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ లేదా ఆ స్థాయి వ్యక్తుల్లో ఎవరినైనా బోర్డు అధ్యక్షుడిగా నియమించాలని సలహా ఇచ్చింది.
మరోవైపు బెట్టింగ్ కేసు తేలే వరకు ఐపీఎల్-7 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై సస్పెన్షన్ విధించాలని తెలిపింది. గురువారం రెండు గంటలకుపైగా ఈ కేసును విచారించిన జస్టిస్ ఏకే పట్నాయక్ బెంచ్ ఈ ప్రతిపాదనలను చేసింది. వీటిపై బోర్డు తమ స్పందనను శుక్రవారం (నేడు) తెలియజేస్తే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. అయితే ఇప్పటి వరకు కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోయినా... ఈ పరిణామాలపై శ్రీనివాసన్ ఎలా స్పందిస్తారని క్రికెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
వాళ్లను కట్టడి చేయండి...
బీసీసీఐ తరఫున సీఏ సుందరమ్ వాదనలను వినిపించగా, బీహార్ క్రికెట్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ప్రతి వాదనలు చేశారు. స్పాట్ ఫిక్సింగ్‌పై ముద్గల్ కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తామని చెప్పిన సుందరమ్ మంగళవారం సుప్రీం కోర్టు చేసిన ప్రతిపాదనలపై బోర్డు స్పందనను ఓ సీల్డ్ కవర్‌లో బెంచ్ ముందుంచారు. అయితే న్యాయమూర్తులు దాన్ని చదివి పక్కనబెట్టి వాదలను వినిపించాలని కోరారు. బీసీసీఐ వ్యవస్థలో చాలా మంది శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ అధికారులే ఉన్నారని సాల్వే చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇక ముందు ఇండియా సిమెంట్స్ అధికారులెవ్వరూ బోర్డు కార్యకలాపాల్లో పాలుపంచుకోరాదని ఆదేశించింది.
ధోని ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడా!
భారత కెప్టెన్ ధోని ప్రవర్తనపై కూడా సాల్వే చాలా ప్రశ్నలు లేవనెత్తారు. మహీ అవినీతి ప్రవర్తనతో వ్యవహరిస్తున్నాడని కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫిక్సింగ్‌లో గురునాథ్ హస్తం ఉందని ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై కెప్టెన్ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. శ్రీనివాసన్, ధోని, ఇండియా సిమెంట్స్ అధికారుల ప్రమేయం లేకుండా గురునాథ్ ఒక్క పని కూడా చేయలేడని కమిటీ తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
దోనిని ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను సాల్వే కోర్టు ముందుంచారు. దీంతో న్యాయమూర్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. చివరగా చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను రద్దు చేయాలని సాల్వే వాదించారు. వాదనల మధ్యలో... స్వతంత్ర వ్యవస్థ అయిన బీసీసీఐలో సమూల మార్పులు చేయాలని ఆదేశించే అధికారం ఈ కోర్టుకు ఉందా అని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకు తాను లిఖితపూర్వకంగా సమాధానమిస్తానని చెప్పారు.