ఆసీస్‌కు సూపర్ ప్రాక్టీస్
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై భారీ విజయం
చెన్నై: టీమిండియాతో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ఘనంగా ఆరంభించింది. తమ బ్యాట్స్‌మెన్‌కు ఫుల్ ప్రాక్టీస్ లభించడంతో మంగళవారం బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన ఏకైక వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ 103 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ స్టొయినిస్ (60 బంతుల్లో 76; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతడికి తోడుగా ఆరంభంలో వార్నర్ (48 బంతుల్లో 64; 11 ఫోర్లు), స్మిత్ (68 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (63 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు.
దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టొయినిస్, మాథ్యూ వేడ్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభణకు ఆసీస్ చివరి 10 ఓవర్లలో 101 పరుగులు సాధించింది. వాషింగ్టన్ సుందర్, కుశంగ్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ 48.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీవత్స్ గోస్వామి (43), మయాంక్ అగర్వాల్ (42) రాణించారు. వీరి మధ్య రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏస్టన్ అగర్‌కు 4 వికెట్లు దక్కాయి.