
ఐపీఎల్-11వ సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ముంబై తరఫున ఓపెనర్‌గా వచ్చి తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఐపీఎల్‌లో రూ. 3.02 కోట్లకు సూర్యకుమార్‌ను ముంబై దక్కించుకుంది. ఐపీఎల్ వచ్చిన డబ్బుతో సూర్యకుమార్ ఓ స్కోడా కారును కొన్నాడు.
అయితే, ఈ కారు తన కోసం కాదు, తన తల్లిదండ్రుల కోసమని చెప్పాడు. ‘ఇది ఓ ఎమోషనల్ మూమెంట్..నేను కొన్న మొదటి కారు ఇది. కానీ నా కోసం కాదు. ఈ కారును అమ్మానాన్నలకు గిఫ్ట్‌గా ఇస్తున్నాను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి వారే కారణం. అందుచేత వారికే నా బహుమతి. ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. లవ్ యూ మామ్ అండ్ డాడ్’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తన తల్లిదండ్రులతో కలిసి కారు వద్ద దిగిన ఫొటో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
ఈ సంవత్సరం ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ మొత్తం 521 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన మొదటి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో సూర్యకుమార్ రాణించాడు. అంతేకాక ఇండియా టీం తరఫున ఆడని ఆటగాళ్లలో 500లకు పైగా పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.