మనీషా-సాత్విక్ జంటకు ‘మిక్స్‌డ్’ టైటిల్
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
ముంబై: ఆద్యంతం నిలకడగా రాణించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కె.మనీషా-సాత్విక్ సాయిరాజ్ ద్వయం టాటా ఓపెన్ ఇండియన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మనీషా-సాత్విక్ జంట 21-13, 21-16తో రెండో సీడ్ అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (భారత్) జోడిపై విజయం సాధించింది. శనివారం టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించిన మనీషా-సాత్విక్ అదే జోరును ఫైనల్లోను కనబరిచారు. సమన్వయంతో ఆడుతూ తమ ప్రత్యర్థికి ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. విజేతగా నిలిచిన మనీషా-సాత్విక్ జోడికి 1,185 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 79 వేలు)తోపాటు 4000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మనీషా కెరీర్‌లో ఇది రెండో అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్. గతంలో ఆమె నందగోపాల్‌తో కలిసి 2013లో మాల్దీవ్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో మనీషా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో మనీషా-సిక్కి రెడ్డి జంట 11-21, 21-15, 13-21తో టాప్ సీడ్ చలాద్‌చలమ్ చాయనిత్-ఫతైమాన్ మ్యున్‌వోంగ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో మనీషా రన్నరప్‌గా నిలవడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది మేఘనతో కలిసి ఫైనల్ ఆడిన మనీషాకు ఓటమి ఎదురైంది.
పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. తన సోదరుడు సౌరభ్ వర్మతో జరిగిన ఫైనల్లో సమీర్ వర్మ 21-11, 21-18తో విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ (భారత్) జోడీ 14-21, 9-21తో వానవత్-ఇస్రియానాతె (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే విజేతలకు ట్రోఫీలను అందజేశారు.