
హైదరాబాద్: ‘జీవితానికి దొరికిన మంచి సోదరుడివి నువ్వు.. ఏదేమైనా.. లవ్ యూ బ్రో.. ఈ సంవత్సరాన్ని నీదిగా మార్చుకో. జన్మదిన శుభాకాంక్షలు’అంటూ కేఎల్ రాహుల్‌కు సోషల్ మీడియా వేదికగా హార్దిక్ పాండ్యా బర్త్‌డే విషెస్ తెలిపారు. కేఎల్ రాహుల్ తన 27వ జన్మదిన వేడుకలను ఢిల్లీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఘనంగా జరపుకున్నాడు. ఈ కార్యక్రమానికి హార్దిక్ పాండ్యాతో పాటు రిషభ్ పంత్, అక్షర్ పటేల్, కృనాల్ పాండ్యా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హార్దిక్ రాహుల్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.
ఇక రాహుల్, హార్దిక్‌లు అనగానే గుర్తుకొచ్చేది ‘కాఫీ విత్ కరణ్’ షోనే. ఈ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ పాలకుల కమిటీ ఆ ఇద్దరిపై ఈ ఏడాది జనవరిలో కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కానీ.. రెండు వారాల వ్యవధిలోనే ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు అదరగొడుతున్నారు. కింగ్స్ పంజాబ్ తరుపున ప్రాతినథ్యం వహిస్తున్న రాహుల్ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక వీరిద్దరు ప్రపంచకప్‌కు ఎంపికవ్వడం విశేషం.