'ఢమాల్' సేన!
0,4,0,0... ఏమిటి అంకెలు అనుకుంటున్నారా. టీమిండియా టాప్ బ్యాట్స్మెన్ సాధించిన పరుగులివి. అవాక్కయ్యారా. ఇంగ్లండ్ తో మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్టు తొలి రోజున వారీ స్కోరు సాధించారు. అంతేకాదు అదే రోజు ఆరుగురు ఆటగాళ్లు డకౌటై రికార్డు కూడా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా రికార్డు కూడా సమం చేశారు. నాయకుడు ధోని ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోరు మూడంకెలు దాటించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ 'టాప్' స్టోరీ మారలేదు. కనీస సమర స్ఫూర్తి చూపకుండానే చేతులెత్తేశారు. 66 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుని చాప చుట్టేశారు. ఇంగ్లీషు టీమ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి అపకీర్తి మూట కట్టుకున్నారు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కుక్ సేనను కంగుతినిపించిన జట్టు ఇదేనా అన్నంత చెత్తగా ఆడి అభాసుపాలయ్యారు.
మూడు, నాలుగు టెస్టుల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వైఫల్యం కారణంగానే ధోని సేన ఢమాల్ అయింది. లార్డ్స్ టెస్టులో రాణించిన రహానే ఒక్కడే మూడో టెస్టులోనూ రెండు అర్థ సెంచరీలు చేసి ఫర్వాలేదనిపించాడు. విదేశీ గడ్డపై మంచి రికార్డు వున్న విరాట్ కోహ్లి ఈ సిరీస్ లో ఘోరంగా విఫలమయ్యాడు.
నాలుగో టెస్టులోనూ పరిస్థితి మారలేదు. టాప్ ఆర్డర్ మూకుమ్మడిగా ప్రత్యర్థి ముందు మోకరిల్లారు. ఐదో బౌలర్ గా జట్టులోకి వచ్చిన అశ్విన్ వీరి కంటే నయమనిపించాడు. అశ్విన్ ఒక్కడే చేసినన్ని పరుగులు కూడా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు చేయలేకపోయారంటే వారెంత దారుణంగా ఆడారో అర్థమవుతుంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే2-1తో వెనుకబడిన ధోని సేన చివరి టెస్టులోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.