అరడజను సున్నాలు.. ఆరు వికెట్లు..
మాంచెస్టర్: భయపడినంతా అయింది. చారిత్రక ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో తమకున్న చెత్త రికార్డును భారత్ క్రికెట్ టీమ్ కొనసాగించింది. ఇంగ్లండ్ తో గురువారమిక్కడ ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ భారత ఆటగాళ్లను బెంబేలెత్తించాడు. ఆరు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. ఆండర్సన్ 3 వికెట్లు తీసి బ్రాడ్ కు అండగా నిలిచాడు. ఇంగ్లీషు బౌలర్ల ధాటికి 8 పరుగులకే టీమిండియా టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరింది. ఆరుగురు పరుగులేమీ చేయకుండానే చేతులెత్తేశారు.
విజయ్, పుజారా, కోహ్లి, జడేజా, భువనేశ్వర్ కుమార్, పంకజ్ సింగ్ డకౌటయ్యారు. గౌతమ్ గంభీర్ 4 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోని(71), ఆశ్విన్(40), రహానే(24) పోరాటంతో టీమిండియా ఆమాత్రమైనా స్కోరు చేయగలిగింది. భారత్ బ్యాటింగ్ 46.4 ఓవర్లలోనే ముగిసింది. జోర్డన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.