బౌలర్లు గాడిలో పడతారా!
నేటి నుంచి విండీస్ బోర్డు ఎలెవన్‌తో రెండో వార్మప్ మ్యాచ్
తుది జట్టు ఎంపికపైనే భారత్ దృష్టి
బసెటర్రీ (సెయింట్ కిట్స్): వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్ తన అస్త్రాలను మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతోంది. తొలి వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ అంచనాలను అందుకున్నా.. బౌలర్లు నిరాశపర్చారు. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా... విండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈనెల 21 నుంచి జరిగే తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేసేందుకు ఈ మ్యాచ్‌ను వేదికగా చేసుకోవాలని కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లి భావిస్తున్నారు. దీంతో ప్రతి బౌలర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని యోచిస్తున్నారు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌లో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా తర్వాత పూర్తిగా విఫలమయ్యారు. కోహ్లి గేమ్ ప్లాన్‌లో కీలకమైన ఇషాంత్, ఉమేశ్‌లు కూడా అంచనాలకు అందుకోలేకపోవడంతో ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇవ్వాలని కోచ్ భావిస్తున్నారు. అయితే పేసర్లు విఫలమైన చోట స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం బాగా ఆకట్టుకున్నాడు.
ప్రధాన స్పిన్నర్ అశ్విన్, జడేజాలను కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దించాలని ప్రణాళికలు వేస్తున్నారు. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ రాణించడం భారత్‌కు శుభసూచకం. ఓపెనర్లు రాహుల్, ధావన్‌లు అర్ధసెంచరీలు చేయడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గింది. అయితే ఓపెనింగ్‌లో మురళీ విజయ్‌కు తోడుగా ఈ ఇద్దరిలో ఎవర్ని దించాలనేది ఈ మ్యాచ్‌తో తేలిపోతుంది. కోహ్లి, రహానే తమ ఫామ్‌ను మరోసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది.