
56 టెస్టుల తర్వాత కూడా అదే కథ
దాదాపు ఐదున్నరేళ్ల తరువాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ తీవ్రంగా నిరాశపరిచాడు.
బెంగళూరు:దాదాపు ఐదున్నరేళ్ల తరువాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో అభినవ్ కు మరోసారి జట్టులో చోటు కల్పించగా డకౌట్ గా అవుటయ్యాడు. 2011లో జూలైలో ఇంగ్లండ్ తో నాటింగ్ హమ్లో జరిగిన టెస్టులో అభినవ్ చివరిసారి కన్పించాడు. ఆ తరువాత మళ్లీ ఇంతకాలానికి జట్టులోకి వచ్చాడు. అంటే ఈ కాలంలో భారత్ తరపున 56 టెస్టులను అభినవ్ మిస్సయ్యాడు.
అయితే ఇంతటి సుదీర్ఘ కాలం తరువాత భారత్ క్రికెట్ జట్టులోకి వచ్చినా అతని ఆట తీరు మాత్రం మారలేదు. అప్పుడు ఇంగ్లండ్ తో ఆఖరిసారి ఆడిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన అభినవ్.. ఆ తరువాత ఆడుతున్న తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా డకౌట్ గానే వెనుదిరిగాడు. అప్పుడు గోల్డెన్ డక్ గా అభినవ్ పెవిలియన్ చేరితే, ఇప్పుడు ఎనిమిది బంతులను ఎదుర్కొని స్టార్క్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. ఆనాటి రెండో ఇన్నింగ్స్ లో అభినవ్ మూడు పరుగులు మాత్రమే చేసి భారత జట్టులో స్థానం కోల్పోయాడు. మళ్లీ చోటు దక్కించుకోవడానికి ఐదేళ్లకు పైగా ఆగాల్సి వచ్చింది. ఒకవేళ ఈ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అభినవ్ రాణించకపోతే అతని కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉంది.