హార్దిక్‌ నామస్మరణతో మార్మోగిన స్టేడియం | Thousands Of Fans Invaded Pitch Hardik's Knock | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ నామస్మరణతో మార్మోగిన స్టేడియం

Published Sat, Mar 7 2020 4:41 PM | Last Updated on Sat, Mar 7 2020 4:52 PM

Thousands Of Fans Invaded Pitch Hardik's Knock - Sakshi

నవీ ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా డీవై పాటిల్‌ టి20 క్రికెట్‌ కప్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న సంగతి తెలిసిందే. గత మంగళవారం 39 బంతుల్లో 105 పరుగులు చేసిన అతను... శుక్రవారం బీపీసీఎల్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. రిలయన్స్‌ వన్‌ జట్టు తరఫున ఆడుతున్న పాండ్యా 55 బంతుల్లోనే 20 సిక్స్‌లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతోపాటు టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు. పాండ్యా విధ్వంసంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రిలయన్స్‌ వన్‌ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బీపీసీఎల్‌ 134 పరుగులకే ఆలౌటై... 104 పరుగుల తేడాతో ఓడింది. (హార్దిక్‌ చితక్కొట్టుడు మామూలుగా లేదు!)

అయితే నిన్నటి మ్యాచ్‌ తర్వాత డీవై పాటిల్‌ స్టేడియం హార్దిక్‌ నామస్మరణతో మార్మోగింది. స్టేడియంలోకి దూసుకొచ్చిన వేల సంఖ్యలో అభిమానులు హార్దిక్‌.. హార్దిక్‌ అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. కొంతమంది ఫ్యాన్స్‌ అయితే రిలయన్స్‌-1 డ్రెస్సింగ్‌  రూమ్‌కు వద్దకు వెళ్లి మరీ హార్దిక్‌ నామస్మరణ చేశారు. ఆడేది దేశవాళీ మ్యాచ్‌ అయినా తమ అభిమానం ఇలానే ఉంటుందని ఫ్యాన్స్‌ చెప్పకనే చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌..
తాను ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌ అని హార్దిక్‌ మ్యాచ్‌ తర్వాత స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన శరీరం ఎలా ఉందో పరీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణావకాశమన్నాడు. ఈ టోర్నీలో ఎలా ఆడాలని సిద్ధమయ్యానో దాన్ని నిజం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అయితే ఇందు కోసం ముందస్తు ప్రణాళిక ఏమీ లేదన్నాడు. క్రీజ్‌లోకి దిగిన తర్వాత పరిస్థితిని బట్టి బ్యాట్‌ ఝుళిపించానని పాండ్యా చెప్పుకొచ్చాడు. గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన పాండ్యా ఆ తర్వాత వెన్నుగాయంతో జట్టుకు దూరమయ్యాడు. వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత పాండ్యా సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్నాడు. తాజాగా డీవై కప్‌లో బరిలోకి దిగి తన ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. దాంతో భారత్‌ ఆడబోయే తదుపరి టోర్నీల్లో ఆడేందుకు పాండ్యా సిద్ధమయ్యాడు. (హార్దిక్‌ బాదుడే బాదుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement