
నవీ ముంబై: వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్న భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా డీవై పాటిల్ టి20 క్రికెట్ కప్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. గత మంగళవారం 39 బంతుల్లో 105 పరుగులు చేసిన అతను... తాజాగా శుక్రవారం బీపీసీఎల్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. రిలయెన్స్ వన్ జట్టు తరఫున ఆడుతున్న పాండ్యా 55 బంతుల్లోనే 20 సిక్స్‌లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతోపాటు టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు.
గతంలో ఈ రికార్డు శ్రేయస్ అయ్యర్ (147)పై ఉండేది. పాండ్యా విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన రిలయన్స్ వన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బీపీసీఎల్ 134 పరుగులకే ఆలౌటై... 104 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో రిలయన్స్ తరఫున ఓపెనర్‌గా దిగిన శిఖర్ ధావన్ (3) నిరాశ పరిచాడు. మ్యాచ్‌లో పాండ్యా బౌండరీల రూపంలోనే 144 పరుగులు సాధించడం విశేషం. అనంతరం బౌలింగ్ కూడా చేసిన పాండ్యా ఒక వికెట్ తీశాడు. భువనేశ్వర్ కూడా ఒక వికెట్‌తో రాణించాడు.