దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా శుక్రవారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో బరోడాతో ముంబై జట్టు తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.
బరోడా నామమాత్రపు స్కోరు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో శశ్వత్ రావత్(33) ఫర్వాలేదనిపించినా.. అభిమన్యు రాజ్‌పుత్(9) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా 24 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ భాను పనియా(2) నిరాశపరిచాడు.
ఈ దశలో శివాలిక్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇక హార్దిక్ పాండ్యా ఐదు పరుగులకే నిష్క్రమించగా.. ఆల్‌రౌండర్ అతిత్ సేత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులతో.. శివాలిక్ శర్మకు సహకారం అందించాడు.
పాండ్యాను అవుట్ చేసిన దూబే
ఇక బరోడా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి మహేశ్ పితియా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్థి, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను శివం దూబే అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ల మధ్య పోరులో దూబే పైచేయి సాధించాడు. దూబే బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి హార్దిక్ అవుటయ్యాడు.
కాగా ఫామ్‌లో ఉన్న ముంబై బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సులువుగానే పూర్తి చేస్తుందని ఆ జట్టు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు
క్వార్టర్ ఫైనల్లో విదర్భ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై సెమీస్‌కు చేరితే... బెంగాల్‌పై గెలిచి బరోడా ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ముంబై తరఫున సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఫుల్ ఫామ్‌లో ఉండగా... గత మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా కూడా రాణించాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెగ్డె, శార్దూల్ ఠాకూర్ ఇలా ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు.
ఢిల్లీతో మధ్యప్రదేశ్..
మరోవైపు బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా బ్యాటింగ్ పరంగా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక రెండో సెమీఫైనల్లో ఆయుశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టు... మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. ఢిల్లీకి అనూజ్ రావత్, యశ్ ధుల్ కీలకం కానుండగా... రజత్ పాటిదార్, వెంకటేశ్ అయ్యర్‌పై మధ్యప్రదేశ్ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది.
— Sunil Gavaskar (@gavaskar_theman) December 13, 2024
Comments
Please login to add a commentAdd a comment