
భారత్‌దే టైటిల్
లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన రెండు పరాజయాలకు బదులు చెబుతూ...
- ‘ఎ’ జట్ల ముక్కోణపు టోర్నీ
- ఫైనల్లో ఆసీస్‌పై విజయం
చెన్నై: లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన రెండు పరాజయాలకు బదులు చెబుతూ... స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత కుర్రాళ్లు ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్ టైటిల్ గెలిచారు. చిదంబరం స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ఖవాజా (88 బంతుల్లో 76; 7 ఫోర్లు), బర్న్స్ (46 బంతుల్లో 41; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించి చక్కటి ఆరంభాన్నిచ్చినా... భారత స్పిన్నర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆసీస్‌ను నియంత్రించారు. కరణ్ శర్మ మూడు వికెట్లు తీయగా... అక్షర్ పటేల్, గురుకీరత్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
భారత జట్టు 43.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ (32), ఉన్ముక్త్ (24) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. అయితే మనీష్ పాండే (9), కరుణ్ నాయర్ (0) విఫలమయ్యారు. కేదార్ జాదవ్ (29) కూడా నిరాశపరిచాడు. దీంతో భారత్ 108 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గురుకీరత్ మాన్ (85 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ (16), సంజు శామ్సన్ (24 నాటౌట్)ల సాయంతో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ‘ఎ’ మూడో జట్టుగా బరిలోకి దిగింది. గురుకీరత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మయాంక్ అగర్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య ఆగస్టు 18 నుంచి రెండు ‘నాలుగు రోజుల మ్యాచ్‌లు’ జరుగుతాయి.