సాక్షి, హైదరాబాద్: స్టువర్ట్ పురం... ఈ పేరు వినగానే ఒక్క క్షణం గుండెలు అదిరిపోతాయి... ఎక్కడ దొంగతనం జరిగినా అందరికీ అదే గుర్తుకొస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఆ ఊరికి పడిన ‘బ్రాండ్’ను ఎవరూ మార్చలేకపోయారు. అయితే ఇలాంటి ప్రాంతంలో పుట్టినా... తెలిసీ తెలియని వయసులో వక్ర మార్గం పట్టకుండా ఆ తండ్రి తన కొడుకును సరైన దిశలో నడిపించాడు. అందు కోసం ఆయనకు కనిపించిన దారి క్రీడలు! తాజాగా ఆసియా యూత్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించిన రాగాల వెంకట రాహుల్ నేపథ్యమిది.
యూనివర్సిటీ స్థాయి వరకు క్రీడల్లో పాల్గొన్న రాహుల్ తండ్రి మధు, తన కొడుకు క్రీడల్లో మరింత ఎదిగేలా ప్రోత్సహించారు. ఆటలో తానే ఓనమాలు నేర్పించినా.... హకీంపేటలోని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్‌ఎస్)లో చేరి రాహుల్ వెయిట్‌లిఫ్టింగ్‌లో మేటిగా మారాడు. గత రెండేళ్ల కాలంలో యూత్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో, యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించి సత్తా చాటిన రాహుల్, ఇప్పుడు ఆసియా యూత్ గేమ్స్‌లో కూడా పసిడి నెగ్గి తన జోరును కొనసాగించాడు.
భోజనం చేయకుండా...
‘ఆసియా యూత్ గేమ్స్‌లో బుధవారం మా అబ్బాయి ఈవెంట్ ఉందని తెలుసు. అందుకే ఉదయం నుంచి కనీసం భోజనం కూడా చేయకుండా కబురు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. చివరకు సాయంత్రం నాలుగున్నరకు రాహుల్ స్వర్ణం నెగ్గాడని తెలిసింది. అతని ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. మేం ఊహించినదానికంటే వేగంగా అతను మంచి విజయాలు సాధిస్తున్నాడు. దేశం తరఫున అబ్బాయి పతకాలు నెగ్గాలన్న మా కల ఫలిస్తోంది. ఇలాంటి విజయాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాం. ఒలింపిక్స్‌లో కూడా అతను భారత్‌కు ప్రాతినిధ్యం వహించి పతకం గెల్చుకోవాలనేది మా కోరిక. మా స్టువర్ట్‌పురంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రపంచం అంతటికీ తెలుసు. అలాంటి చోట ఒక గిరిజన కుటుంబంలోని పిల్లలు తప్పు దోవ పట్టకుండా కాపాడుకోవడం అంత సులభం కాదు. అందుకోసం మేం ఆటనే నమ్మకున్నాం. ఇప్పుడు ఆ ఫలితం కనిపిస్తోంది.’
- ‘సాక్షి’తో రాహుల్ తల్లిదండ్రులు రాగాల మధు, నీలిమ
మా కొడుకును కాపాడుకున్నాం!
Published Thu, Aug 22 2013 1:00 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM
Advertisement
Advertisement