బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ ఆటగాడు ధావన్, కోచ్, కెప్టెన్ సమాలోచనలు
ఎన్నెన్నో మలుపులు.. ఎన్నెన్నో మెలికలు. ఎన్నెన్నో ఎత్తులు.. ఎన్నెన్నో లెక్కలు. ఈసారి.. ప్రతిసారీ.. ఇవే ఉత్కంఠభరిత, ఉత్తేజకర పరిణామాలు. అందుకే ఐపీఎల్ ప్రీమియర్ లవ్లీ లీగ్ అయింది. క్రికెట్ పిచ్చోళ్లకు కిక్కిచ్చే మేటి పోటీ అయింది. అలాటి కిర్రాక్ పార్టీ లాటి టోర్నీ.. చావో రేవో తేలే దశలో.. నువ్వో నేనో మిగిలే కసితో.. జరుగుతున్న ప్లే ఆఫ్ మ్యాచ్‌లను తెచ్చి మన వైజాగ్‌కు బహుమతిలా అప్పజెప్పింది. ఇక చూస్కో నా సామిరంగా.. ఇప్పుడు వైజాగ్ క్రేజీ క్రికెట్ జోరుతో ఊగిపోతోంది. కీలకమైన ఎలిమినేషన్ మ్యాచ్ బుధవారం మన వైఎస్సార్ స్టేడియంలో సర్రని దూసుకుపోయే తారాజువ్వలా దూసుకుపోనుండగా.. రెండు కసి మీద ఉండే జట్లు పేల్చబోయే సిక్సర్ల ఔట్ల కోసం.. బౌండరీల బాంబుల కోసం ప్రతి క్రికెట్ వీరాభిమాని హృదయం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మరోవైపున ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య కాబోతూ ఉండడంతో అటు ఇదే హోం గ్రౌండయిన సన్‌రైజర్స్ సత్తా చూపి టోర్నీలో నిలబడాలని పట్టుదలతో ఉంటే.. అనుకోకుండా దొరికిన అవకాశాన్ని వృథా కానివ్వకూడదని దూకుడు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కాలుదువ్వుతోంది. రేగిపోతున్న ఈ రెండు జట్ల మధ్య జరగబోయే హోరాహోరీ పోరును చూడడానికి వైఎస్సార్ స్టేడియం ఫుల్ ప్యాక్డ్‌గా రెడీగా ఉంది. ఇక టోర్నీలో నిలిచే జట్టేది? నిరాశతో వెనుతిరిగే జట్టేది? నేడే తేలిపోతుంది. గెట్ రెడీ ఫర్ ది థండర్. గెట్ రెడీ ఫర్ ది ఫీవర్!
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్‌లో రన్నర్సప్ హోదాలో ఎలిమినేషన్ మ్యాచ్‌కు సిద్దమౌతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్....ఏడేళ్ల ఆనంతరం తిరిగి ఐపీఎల్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య నాకౌట్ పోరుకు విశాఖ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. తొలిసారిగా ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న విశాఖ స్టేడియం... సన్‌రైజర్స్‌కు రెండో హోమ్ గ్రౌండ్. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లీగ్‌లో ఢిల్లీ కాపిటల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఒకదశలో ఏకంగా తొలిస్థానానికే ఎగబాకింది. ఇక 12 పాయింట్లే సాధించిన జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం విశేషం. నెట్ రన్‌రేట్‌తో సన్‌రైజర్స్ ఇలా ప్లేఆఫ్‌కు చేరుకోగలిగింది. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ మంచి ఊపు మీద ఉన్నా నెట్‌రన్‌రేట్‌లో వెనుకబడి ఎలిమినేషన్ ఆడాల్సి వస్తోంది. ఇక ఈ రెండు జట్ల మధ్య పోరులో విజయం ఎవర్ని వరిస్తే ఆ జట్టు క్వాలిఫైయింగ్‌కు చేరుకోనుండగా ఓడిన జట్టు ఇంటికి మరలనుంది. అందుకే క్వాలిఫయింగే లక్ష్యంగా విశాఖ స్టేడియంలో ఇరు జట్లు మంగâ¶ళ వారం ప్రాక్టీస్ చేసాయి. సాయంత్రం ఢిల్లీ కాపిటల్స్ నెట్ ప్రాక్టీస్ చేయగా, రాత్రి సన్‌రైజర్స్ జట్టు ప్రాక్టీస్ చేసింది.
దేశవాళీ సత్తా
ఇరుజట్లకు విశాఖ పిచ్‌పై కొంత అవగాహన ఉంది. ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. అది వారికి కలిసివచ్చే అంశం కాగా...చాంపియన్‌గా నిలిచిన సత్తా సన్‌రైజర్స్‌ది. సన్‌రైజర్స్ నాలుగు సార్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించగా ఓసారి విజేతగా ప్రస్తుతం రన్నర్సప్‌గా బరిలోకి దిగుతుంది. ఆ జట్టు గతంలో వైజాగ్‌లో ఆడినదే. ఇక మూడుసార్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన ఢిల్లీ కాపిటల్స్ ఏడేళ్ల అనంతరం మరోసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించి పోరుకు సిద్ధమవుతోంది. ఇరుజట్లకు చెందిన విదేశీ స్టార్ ఆటగాళ్ళు జట్టుకు అందుబాటులో లేరు. çపసికూన అయిన ఆఫ్గాన్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్ళపై సన్‌రైజర్ ఆధారపడగా ఢిల్లీకి టాప్‌ఆర్దర్‌లో నలుగురు స్వదేశీ ఆటగాళ్లే ఉండటం కలిసివచ్చే ఆంశమే.
సమాయానుకూలం.. కీలకం
విశాఖలో ఎలిమినేషన్ మ్యాచ్ ఆడుతున్న రెండు జట్లకు పిచ్ కండిషన్ కొత్తే అయినా సమయానుకూలంగా ఆడిన జట్టే క్వాలిఫయింగ్‌కు చేరుకోగలదు. ఇరుజట్లలోనూ స్టార్ విదేశీ ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో లేరు. రబడ గాయం కారణంగా వెనుతిరగ్గా విరుచుకుపడే వార్నర్ ఇంటి ముఖం పట్టాడు. ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు టాప్ ఆర్డర్‌లోని పృధ్వీషా, రిషబ్ పంత్, శిఖర్ ధావన్‌లలో ఏ ఇద్దరు పదహారు ఓవర్ల వరకు నిలిచినా భారీ స్కోర్ నమోదు కానుంది. శిఖర్–పృధ్వీ ఓపెనర్లుగా రాణిస్తుండగా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ తోడవుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రబడ స్థానంలో ఇషాంత్ చెలరేగనున్నాడు. ట్రెంట్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ బంతితో చెలరేగనున్నారు. అజింక్యా, లివింగ్‌స్టోన్ స్లోవర్ డెలివరీలు వేయడానికి సిద్ధమౌతున్నారు. ఇక సన్‌రైజర్స్ చాంపియన్‌గా అనుభవంతో తలపడనుంది. అఫ్గాన్ కుర్రాడు నబీ బౌలింగ్‌ను వినియోగించుకోనుంది. విజయ్‌శంకర్, యూసఫ్ పఠాన్‌లో ఒకరిని ఓపెనింగ్‌కు పంపే అవకాశాన్ని కెప్టెన్ భువనేశ్వర్ పరిశీలిస్తున్నాడు. మనీష్‌పాండే, దీపక్‌లు బ్యాట్‌కు పనిచెప్పనుండగా షాకిబ్, సందీప్, సిద్ధార్థ, రషీద్ బంతితో మెరిపించనున్నారు. బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు తొలి బంతి నుంచే విశాఖ క్రీడాభిమానులకు ఎలిమినేషన్ నాకవుట్ మ్యాచ్ ఉత్కంఠను రేకెత్తించనుంది.
Comments
Please login to add a commentAdd a comment