అగ్రశ్రేణి ఆటగాళ్లకు పరీక్ష | Top players test | Sakshi
Sakshi News home page

అగ్రశ్రేణి ఆటగాళ్లకు పరీక్ష

Published Tue, Apr 1 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

అగ్రశ్రేణి ఆటగాళ్లకు పరీక్ష

అగ్రశ్రేణి ఆటగాళ్లకు పరీక్ష

భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా
సైనా ఈసారైనా నెగ్గేనా?
నేటి నుంచే ఇండియా ఓపెన్
 

 
 న్యూఢిల్లీ: ప్రపంచంలోని పలువురు టాప్ షట్లర్లు పాల్గొంటున్న ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌కు నేడే తెరలేవనుంది. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌తో సహా దాదాపు స్థానిక క్రీడాకారులందరికీ క్లిష్టమైన డ్రాలే ఎదురు కానుండడంతో టోర్నీపై గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తి నెలకొంది. భారత షట్లర్లలో సైనాకు మాత్రమే సీడింగ్ (8వ) లభించింది. ప్రపంచ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా) టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ రచానోక్ (థాయ్‌లాండ్) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది.

 సైనాకు తొలిరౌండ్‌లో సిమోన్ ప్రచ్ (ఆస్ట్రియా) రూపంలో తేలికైన ప్రత్యర్థే ఎదురు పడనున్నా, క్వార్టర్స్‌కు చేరితే మాత్రం ఎనిమిదో సీడ్ చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌తో కఠిన పరీక్షే కానుంది. ఈ టోర్నీ గత మూడు ఎడిషన్లలో రెండో రౌండ్ దాటలేకపోయిన సైనా... ఈసారి తన రికార్డును మెరుగు పరచుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక హైదరాబాద్ రైజింగ్ స్టార్ సింధు తొలి రౌండ్‌లోనే రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో తలపడనుంది. అయితే ఇటీవల స్విస్ ఓపెన్‌లో సింధు... షిజియాన్‌ను ఓడించడంతోపాటు ఓవరాల్‌గా ఆమెపై 3-0 రికార్డు కలిగి ఉండడం మానసికంగా పైచేయిగా కనిపిస్తోంది. ఇక ఇండియా ఓపెన్‌లో గత రెండు టోర్నీల్లో వరుసగా క్వార్టర్స్, సెమీఫైనల్‌కు చేరిన సింధుకు మంచి రికార్డే ఉంది.

 లీ చోంగ్ వీ (మలేసియా) టాప్‌సీడ్‌గా బరిలోకి దిగుతున్న పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌కు తాజా ర్యాంకింగ్ కారణంగా క్లిష్టమైన డ్రానే లభించింది. తొలిరౌండ్‌లోనే కశ్యప్ ఆరోసీడ్ చైనా ఆటగాడు జెంగ్‌మింగ్ వాంగ్‌తో తలపడాల్సివస్తోంది. మలేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సౌరభ్ వర్మ, కె.శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్ వంటివారు భారత్ తరపున ప్రధాన ఆటగాళ్లు కాగా... మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసి, తన్వీ లాడ్, తృప్తి ముర్గుండే, సైలి రాణే, అరుంధతి లాంటి ద్వితీయశ్రేణి క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి-ప్రద్న్యా గాద్రె, ప్రజక్తా సావంత్-ఆరతి జోడీలు, మిక్స్‌డ్‌లో తరుణ్ కోన-అశ్విని, విష్ణు-అపర్ణా బాలన్ జంటలపై అంచనాలున్నాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement