ఆర్‌బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉమేశ్
నాగ్‌పూర్: ఒకప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నించిన భారత జట్టు పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో ఉన్నతోద్యోగిగా మారాడు. నాగ్‌పూర్ కార్యాలయంలో అతడికి అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. సోమవారం దీనికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేశాడు.
చాంపియన్స్ ట్రోఫీకన్నా ముందే మేలో ఉమేశ్ ఆర్‌బీఐ అధికారులను కలిశాడు. స్పోర్ట్స్ కోటా కింద అతడికి అనుమతి లభించినా వెంటనే ఇంగ్లండ్‌కు వెళ్లడంతో అప్పుడు అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి వీలు కాలేదు. ఉమేశ్ ఇంట్లో దొంగతనం: మరోవైపు ఆదివారం ఉమేశ్ యాదవ్ ఫ్లాట్‌లో దొంగతనం జరిగింది. ఆదివారం రాత్రి ఆగంతకులు అతడి ఇంట్లో చొరబడి రూ.45 వేల నగదుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను తస్కరించారు. ఆ సమయంలో ఉమేశ్ కుటుంబం ఇంట్లో లేదు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.