
బయట తిరిగే అవకాశం లేదు!
హోటల్ మార్చండన్న టీమిండియా
ఢాకా: గతంలో బంగ్లాదేశ్‌కు ఎప్పుడు వచ్చినా భారత్ అదే హోటల్‌లో ఉంది. ఆతిథ్య జట్టుతో పాటు ఏ విదేశీ జట్టుకైనా అక్కడే బస. ఇటీవల మన ప్రధాని మోది కూడా అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు మాత్రం తాము ఉంటున్న పాన్ పసిఫిక్ హోటల్ (సొనార్గావ్ ప్రాంతం)నుంచి తమను మార్చమని కోరుతున్నారు. ‘ఈ ఏరియాతోనే అసలు సమస్య. ఇక్కడ జనం చాలా ఎక్కువగా ఉన్నారు. మేం బయటికి వెళ్లలేకపోతున్నాం. దగ్గరలోని గుల్షన్ ప్రాంతం అయితే బాగుంటుంది. అక్కడ రెస్టారెంట్‌లు కూడా చాలా ఉన్నాయి’... ఇదీ మనవాళ్లు చెబుతున్న కారణం.
అయితే ఇప్పటికిప్పుడు మరో హోటల్‌లో గదులు సమకూర్చడం కష్టమవడంతో పాటు భద్రతా కారణాల వల్ల కూడా ఇది సాధ్యం కాదని బంగ్లా బోర్డు స్పష్టం చేసినట్లు తెలిసింది. అసలు ఫతుల్లా టెస్టు సమయంలోనే భారత్ ఫిర్యాదు చేసినా ఆటగాళ్లు అక్కడే ఉండేందుకు బీసీబీ ఒప్పించింది. భారీ వర్షం కారణంగా టెస్టులో ఎక్కువ భాగం రద్దు కాగా, వన్డేలకు కూడా వాన ముప్పు ఉండటంతో భారత ఆటగాళ్లు హోటల్‌లో ఉండేందుకు చికాకు పడుతున్నట్లు తెలిసింది. భారత జట్టు తమ హోటల్ మార్చమని కోరడం గతంలో ఎన్నడూ జరగలేదు.