క్రికెటర్ ప్రశ్నిస్తే.. జట్టులో చోటు!
సిడ్నీ: శ్రీలంక చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమికి కేవలం జట్టులోని ఒకరిద్దరు ఆటగాళ్లనే బలిపశులవులను చేశారన్న ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా వ్యాఖ్యలు ప్రభావం చూపించాయి. దాంతో మళ్లీ ఆసీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే వారం దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కు ఖవాజా ఆసీస్ క్రికెట్ బోర్డు నుంచి పిలుపు అందుకున్నాడు. లంక గడ్డపై- వారి చేతిలోనే మూడు టెస్టుల సిరీస్ లో 3-0తో వైట్ వాష్ కు గురైన తర్వాత.. ఖవాజా, జోయ్ బర్న్స్ లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఆస్ట్రేలియా టీమ్ లంకపై టెస్టుల్లో మాత్రమే కాదు, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో వన్డే చరిత్రలోనే తొలిసారిగా 5-0తో వైట్ వాష్ కాలేదా అని ఖవాజా ప్రశ్నించాడు. దీంతో అతడికి మళ్లీ అవకాశం ఇవ్వాలని జట్టు బోర్డు భావించి సఫారీలతో సిరీస్ కు ఎంపిక చేసింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్, షాన్ మార్ష్, హజెల్ వుడ్ సఫారీలతో టెస్టు సిరీస్ లో రాణించేందుకు సన్నద్ధమయ్యారు. జో మెన్నీ అనే ఆటగాడు అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటికే టెస్టు, వన్డేల్లో ఘోర వైఫల్యాలతో ఎదురీదుతున్న ఆసీస్ ఈ టెస్ట్ సిరీస్ నెగ్గి వన్డే సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్(వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, అడమ్ వోజెస్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, పీటర్ నెవిల్, జో మెన్నీ, మిచెల్ స్టార్క్, పీటర్ సిడిల్, నాథన్ లియాన్, హజెల్ వుడ్