భారత్ ఆశలపై వర్షం
► డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో
► 2 పరుగులతో పాకిస్తాన్ విజయం
► మహిళల టి20 ప్రపంచకప్
న్యూఢిల్లీ: చేసింది కేవలం 96 పరుగులే... అయినా భారత మహిళలు పోరాడారు. ఓ దశలో అలవోక విజయం దిశగా సాగుతున్న పాకిస్తాన్ మహిళలను కట్టడి చేశారు. పది బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు తెచ్చుకున్నారు. ఇక పాకిస్తాన్ విజయం కోసం 24 బంతుల్లో 20 పరుగులు చేయాలి. క్రీజులో మిగిలిన వాళ్లంతా బౌలర్లు. కాబట్టి భారత్ గెలుపు అవకాశాలు బాగా పెరిగాయి. ఇలాంటి స్థితిలో వరుణుడు మిథాలీసేన ఆశలపై నీళ్లుజల్లాడు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ రెండు పరుగులతో విజయం సాధించింది.
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గట్టెక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 96 పరుగులు చేశారు. వేద కృష్ణమూర్తి (19 బంతుల్లో 24; 3 ఫోర్లు) రాణించగా... మిథాలీ (35 బంతుల్లో 16; 1 ఫోర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (19 బంతుల్లో 16; 2 ఫోర్లు), జులన్ గోస్వామి (14 బంతుల్లో 14) మోస్తరుగా ఆడారు. మిథాలీ, హర్మన్‌ప్రీత్ మూడో వికెట్‌కు 29; వేద, గోస్వామి ఐదో వికెట్‌కు 22 పరుగులు సమకూర్చడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం పాకిస్తాన్ 16 ఓవర్లలో 6 వికెట్లకు 77 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. నహిదా ఖాన్ (14), మునీబా అలీ (12 నాటౌట్), ఇరామ్ జావేద్ (10) పోరాడారు.
ఆరంభంలో విఫలమైన భారత బౌలర్లు చివర్లో మాత్రం విజృంభించారు. ఓ దశలో 70/3 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న పాక్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. 10 బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీయడంతో స్కోరు 77/6గా మారింది. ఈ దశలో భారీ వర్షం పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. చివరకు డక్‌వర్త్ పద్ధతిలో పాక్‌కు స్వల్ప విజయం దక్కింది. అనమ్ అమిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: మిథాలీ (సి) సిద్రా అమిన్ (బి) నిడా దర్ 16; వనిత (సి) సనా మిర్ (బి) అనమ్ అమిన్ 2; మందన ఎల్బీడబ్ల్యు (బి) అస్మవి ఇక్బాల్ 1; హర్మన్‌ప్రీత్ (సి) సిద్రా అమిన్ (బి) సాడియా యూసుఫ్ 16; వేద కృష్ణమూర్తి (సి అండ్ బి) సనా మిర్ 24; జులన్ గోస్వామి రనౌట్ 14; అనుజా పాటిల్ రనౌట్ 3; శిఖా పాండే నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 96.
వికెట్ల పతనం: 1-3; 2-5; 3-34; 4-49; 5-71; 6-80; 7-96.
బౌలింగ్: అనమ్ అమిన్ 4-0-9-1; అస్మవి ఇక్బాల్ 4-0-13-1; సనా మిర్ 4-0-14-1; సాడియా యూసుఫ్ 3-0-24-1; బిస్మా మహరూఫ్ 2-0-12-0; నిడా డర్ 3-0-23-1.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: నహిదా ఖాన్ (సి) కౌర్ (బి) పాండే 14; సిద్రా అమిన్ (బి) గైక్వాడ్ 26; బిస్మా (సి) గోస్వామి (బి) కౌర్ 5; మునీబా నాటౌట్ 12; ఇరామ్ జావేద్ (సి) మిథాలీ (బి) గోస్వామి 10; అస్మావి ఇక్బాల్ రనౌట్ 5; సనా మిర్ రనౌట్ 0; నిడా డర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (16 ఓవర్లలో 6 వికెట్లకు) 77.
వికెట్ల పతనం: 1-19; 2-48; 3-50; 4-71; 5-77; 6-77.
బౌలింగ్: అనుజా పాటిల్ 3-0-14-0; రాజేశ్వరి గైక్వాడ్ 2-0-11-1; శిఖా పాండే 2-0-14-1; జులన్ గోస్వామి 4-0-14-1; పూనమ్ యాదవ్ 3-0-14-0; హర్మన్‌ప్రీత్ 2-0-9-1.